కథ కుదురుతోంది.. కానీ సెట్స్‌పైకి!!

సినీప్రియులు వెండితెరపై చూసి తరించాలనుకునే కలయికల్లో నందమూరి, మెగా హీరోల జోడీ ఒకటి. ఇప్పుడది ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర రూపంలో నెరవేరబోతుంది. కానీ, ప్రేక్షకులు కోరుకునే అసలు సిసలు జోడీ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణలది. వీళ్లిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలని ఎన్నో ఏళ్లుగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏ దర్శకుడైనా ఇలాంటి ఊహ చేశారో లేదో? తెలియదు కానీ, ఇప్పుడీ ఇద్దరు అగ్ర తారల కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌. నిజానికి ఈ కథ వాళ్ల దగ్గర ఎప్పటి నుంచో ఉంది. కానీ, స్క్రిప్ట్‌ రూపుకు తీసుకురాలేదు. అయితే ఇప్పుడీ కథను చక్కటి స్క్రిప్ట్‌గా మలిచే పనిలో బిజీగా ఉన్నారట ఈ ప్రముఖ రచయితలు. ఒకసారి ఈ పనులు పూర్తయితే చిరు, బాలయ్యలకు ఈ స్క్రిప్ట్‌ వినిపించి సినీప్రియులకు శుభవార్త వినిపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అయితే తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు మల్టీస్టారర్‌ల వైపు పెద్దగా మొగ్గు చూపని బాలయ్య ఇప్పుడీ కథకు ఓకే చెప్తారా? అన్నది ఆసక్తికరాంశం. ఒకవేల అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి సుబ్బిరామి రెడ్డి ముందుకొచ్చే అవకాశాలున్నాయి. మరి నిజంగా ఈ కథ కార్యరూపం దాల్చుతుందా? లేక మళ్లీ అటకెక్కుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.