సెట్స్‌పైకి వెళ్లకముందే కథలు అల్లేస్తున్నారుగా..

‘సైరా’ హడావుడి ముగియడంతో మెగా అభిమానుల చూపంతా చిరంజీవి తదుపరి చిత్రంపైకి వెళ్లిపోయింది. ‘చిరు 152’గా సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. డిసెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రం పూర్తిగా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నెట్టింట రకరకాల కథలు అల్లేసుకుంటున్నారు సినీప్రియులు. ముందుగా కథ విషయానికొస్తే.. ఓ సరికొత్త సామాజిక సందేశాన్ని వినిపిస్తూ కొరటాల శైలిలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రమట. దేవాలయాలకు సంబంధించిన భూములను ఇతర విలువైన ఆస్తులను కొల్లగొట్టే ముఠాల చుట్టూ అల్లుకున్న కథగా ఉంటుంది. అందుకే ఈ కథకు తగ్గట్లుగానే చిత్రానికి ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు  ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట చిరు. మాస్టర్‌గా ఓ పాత్రలో దర్శనమివ్వనున్నారని చిత్ర సీమలో వినిపిస్తోంది. ఇక కథానాయికల విషయానికొస్తే.. ఇందులో చిరుకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలకు అవకాశముందట. ఇప్పటికే ఓ నాయికగా త్రిషను ఎంపిక చేసుకున్నారని, మరో నాయికగా కాజల్, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా బయటకొస్తున్న మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ సినిమాతో జెనీలియా తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. చిరుతో రెండో కథానాయికగా చేసేందుకు జెన్నీ రెడీ అవుతున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలొస్తున్నాయి. మరి వీటిల్లో వాస్తవమేంటి? ఏ వార్తలు నిజమౌతాయి? అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.