‘గోవిందా గోవింద’ అలా.. ‘శుభలగ్నం’ ఇలా

నాగార్జున, శ్రీదేవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘గోవిందా గోవింద’. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడు. జగపతి బాబు, రోజా, ఆమని ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘శుభలగ్నం’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. రెండు చిత్రాలకు నిర్మాత: అశ్వనీదత్‌.తాజాగా ఈ రెండు సినిమాల గురించి ‘వింటేజ్‌ వైజయంతీ’ పేరుతో కొన్ని విశేషాలు పంచుకుంది వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ. జగపతి బాబు వాయిస్‌ ఓవర్‌ అందించారు. ‘వైజంతీ మూవీస్‌ ప్రతి సినిమా వెనకాల పెద్ద కథ ఉంది, కష్టం ఉంది. ఛాలెంజ్‌ కూడా ఉంది. అలా చేసిన సినిమానే ‘గోవిందా గోవింద’. దత్తు గారి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద తీసిన సినిమా. ఈ సినిమాలో కాంప్రమైజ్‌కాని సెట్లు, సౌండ్స్, నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. పెద్ద బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ సినిమాకి మొట్టîమొదట ఇబ్బంది ఎదురైంది సెన్సార్‌ బోర్డుతోనే. సినిమాలో దాదాపు 50 శాతం తొలగించాలని నిర్ణయించారు. మొత్తానికి వాదించి, గొడవపడి చివరకు విడుదల చేశారు. కానీ దేవుడి దీవెనలు అందలేదు. సినిమా విజయం అందుకోలేదు. ఇప్పుడు టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు భలే ఉందంటున్నారు.అదే కథను ఈ రోజు తీస్తే హిట్‌ అయ్యేదేమో! కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అయినా సరే, మనం వెనక్కి తిరిగి చూసినపుడు కొంచెం గర్వంగా ఉంటుంది. అలా గర్వపడే సినిమానే ‘గోవిందా గోవింద’. వైజంతీ మూవీస్‌ కొన్నాళ్లు ఆర్థికంగా నష్టపోయింది. ఈ రోజుల్లో నిర్మాత కాస్త కష్టాల్లో ఉంటే ఆయన కార్యాలయానికి కూడా ఎవరూ వెళ్లని పరిస్థితి. అలాంటిది ఒక బ్లాక్‌ బ్లస్టర్‌ డైరెక్టర్‌ ఆయనతో ఎందుకు సినిమా తీస్తారు? కానీ జరిగింది అదే. ఎస్వీ కృష్ణారెడ్డి దత్తు గారికి ఫోన్‌ చేసి నేను మీతో సినిమా చేస్తున్నాను. వెంటనే మొదలు పెడదామని ‘శుభలగ్నం’ చిత్రానికి శ్రీకారం చుట్టార’ని తెలిపారు జగపతి బాబు. అలా నష్టాల్లో ఉన్న అశ్వనీదత్‌కి ఎస్వీ కృష్ణారెడ్డి ‘శుభలగ్నం’ అందించి కాసుల వర్షం కురిపించారు. పూర్వ వైభవం తీసుకొచ్చారు. ‘ఆ సినిమా మా జీవితంలో ఓ శుభలగ్నం’ అని అశ్వనీ దత్‌ సతీమణి ఎప్పుడూ అంటుంటారు.

Also Read : ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు!

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.