సర్‌ప్రైజ్‌.. బాలీవుడ్‌లోకి మారుతి!!
రోజుల్లో’, ‘బస్‌స్టాప్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలతో దర్శకుడిగా చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మారుతి. చిన్న చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించే దర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడీ యువ దర్శకుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ మొత్తం దక్షిణాది కథల చుట్టూనే తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ చిత్రమైనా హిట్‌ కొడితే చాలు.. వెంటనే బాలీవుడ్‌ నిర్మాతలు సదరు కథ కోసం పోటీపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మారుతి హిట్‌ చిత్రం ‘మహానుభావుడు’పై మనసు పారేసుకుందట. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయడానికి సిద్ధమైందట. అంతేకాదు ఈ హిందీ వెర్షన్‌ను కూడా మారుతినే తెరకెక్కించాల్సిందిగా కోరిందట సదరు నిర్మాణ సంస్థ. నిజానికి ఆయనకు గతంలోనే బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. ఆయన తెరకెక్కించిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ను బాలీవుడ్‌లో తెరకెక్కించాల్సిందిగా కోరగా.. అప్పటికి ఆయన ఇక్కడ మరో సినిమాతో బిజీగా ఉండటంతో దాన్ని తిరస్కరించారట. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉన్నాడట మారుతి. ఈ సినిమా చేయడానికి బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలు పోటీ పడుతున్నారట. ఇందులో ఆయుష్మాన్‌, రణ్‌వీర్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయట. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలియరాలేదు కానీ, త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్టు బయటకు రానుందట. ప్రస్తుతానికైతే మారుతి ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘చిత్రలహరి’ వంటి హిట్ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.