తొలినాళ్లలో బాధేసింది.. ‘జల్సా’ మార్పు తెచ్చింది

పరిచయం లేని రంగంలో అడుగుపెడితే ఎవరికైనా కొంతకాలం కష్టమనిపిస్తుంది. ఆ పరిశ్రమ, పని అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందిగానే ఉంటుంది. వీటితోపాటు పక్కవాళ్ల నుంచి విమర్శ ఎదురైతే? అసహనం దరి చేరుతుంది. గోవా బ్యూటీ ఇలియానాకి ఇదే అనుభవం ఎదురైంది. మోడలింగ్‌ రంగం నుంచి చిత్ర సీమకు వచ్చిందీ భామ. ఈ ముద్దుగుమ్మ నటించిన ఓ ప్రకటన చూసి ‘దేవదాసు’ అవకాశం ఇచ్చారు వై.వి.ఎస్‌.చౌదరి. చిత్రీకరణ అంతా భారంగానే నెట్టుకొచ్చింది. ఏదో విధంగా సినిమా పూర్తి చేసింది. తొలి చిత్రంలోనే అందాలు ఆరబోయడంతో కుర్రకారు మదిని దోచుకుంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయం అందుకోవడంతో ‘పోకిరి’ సినిమాలో నటించే సదవకాశం కొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒకదాని కోసం నిర్విరామంగా 20 గంటలు పనిచేసిందట ఇలియానా. ‘ఈ సమయంలో ఓ సహాయ దర్శకుడు నా నటనని విమర్శించారు. అప్పుడు చాలా బాధేసింది. అమ్మకి చెప్పి ఏడ్చాను. ఇక్కడ ఒక్క క్షణం ఉండొద్దు. వెంటనే వెళ్లిపోదాం అన్నాను. అమ్మే నాకు ధైర్యం చెప్పింది. ఇచ్చి మాట ఎప్పుడూ తప్పకూడదు. ఒప్పందం ప్రకారం ఇది పూర్తి చేయాలని తెలిపింది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ తార. అంతేకాదు ‘జల్సా’ సినిమా ఆమెలో చాలా మార్పు తీసుకొచ్చిందని వివరించింది. క్రమక్రమంగా సినిమాపై ఇష్టం పెంచుకుని నటనలో పరిణితి కనబరిచి ప్రశంసలు అందుకుంది. గత కొద్దికాలంగా టాలీవుడ్‌కి దూరమైన ఇలియానా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.