భారత్‌ మరో ఇటలీలా మారకుండా నివారిద్దాం

‘‘భారత్‌ మరో ఇటలీలా సంక్షోభంలోకి వెళ్లకూడదంటే.. జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలి’’ అన్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. భారత్‌లో కరోనా 3వ దశకు చేరుకోకుండా నివారించే ఉద్దేశంతో భారత ప్రధాని ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మహా యజ్ఞానికి మద్దతుగా సినీ ప్రముఖులు కూడా జాగృతం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ కూడా జనతా కర్ఫ్యూను పాటించాల్సిన అవశ్యకతను ప్రజలకు ఓ వీడియో ద్వారా వివరించారు. ‘‘కరోనా 3వ దశ అయిన సమూహ వ్యాప్తి పరిస్థితులు దేశంలో ఏర్పడకుండా నివారించే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’కి పిలుపునిచ్చారు. ఈ దశను నివారించడం కోసమే ఇటలీలో ఇదే తరహాలో కర్ఫ్యూ అమలు ప్రయత్నించారు. కానీ, ఆ దేశ పౌరుల నుంచి కనీస మద్దతు లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా వేలాది మంది ప్రజలు ఆ మహమ్మారికి బలయ్యారు. భారతదేశంలో ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడకూడదని కోరుకుందాం. కాబట్టి ఇది జరగాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక దూరాన్ని అభ్యసించడం కోసం ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరుతున్నా. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ ప్రజల రక్షణ కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని గుర్తు చేసుకొందాం. వాళ్ల సేవలకు కృతజ్ఞతగా ఆదివారం సాయంత్రం 5గంటలకు కరతాళ ధ్వనులు, ప్రార్థనలతో సంఘీభావం తెలుపుదాం’’ అంటూ ఆ వీడియో ద్వారా ప్రజలకు హితబోధ చేశారు రజనీ.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.