సెట్స్‌పై ఉండగానే.. ఇన్‌స్టాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ఎనర్జిటిల్ స్టార్ రామ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్`.. ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్ర్కిప్ట్‌ను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్‌బాస్కెట్‌ అనే గ్రూప్‌లో లీక్‌ చేశారు. ఈ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నటువంటి మురళీ కృష్ణను చిత్ర బృందం సంప్రదించి గ్రూప్‌ నుంచి స్క్రిప్ట్‌ను తీసేయాలని కోరారు. కానీ, సదరు వ్యక్తి చిత్ర బృందం నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు పూరీ హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సదరు గ్రూప్‌ వారు మాత్రం.. తాము ఆ పోస్టును ఎప్పుడో తొలగించామని, కేవలం చిత్ర ప్రచారం కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.