గట్టిగా అనుకుంటే ఏమైనా చేయగలం..

‘‘తెలిసింది మాత్రమే చేయాలనుకునే మనస్తత్వం నాది. కానీ సినీ పరిశ్రమకి వచ్చాక ఆ తీరు మారింది’’ అంటోంది కీర్తి సురేష్‌. ‘మహానటి’ తర్వాత కథానాయిక ప్రాధాన్యంతో కూడిన చిత్రాలకి చిరునామాగా మారిందీమె. తెలుగుతో పాటు హిందీలోనూ అలాంటి అవకాశాల్ని అందుకొంటోంది. కథానాయిక అయ్యాక మీలో మీకు కనిపించిన కీలక మార్పులేమైనా ఉన్నాయా? అని అడిగితే... కొన్ని విషయాల్లో చాలా మారానని చెప్పుకొచ్చింది కీర్తి. ‘‘వ్యక్తిగత విషయాల్లో మనసుకు నచ్చింది చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. కానీ వృత్తిపరంగా మాత్రం కొత్తలో చాలా భయాలుండేవి. తెలియకుండా ఏం చేస్తే, ఏమవుతుందో అనిపించేది. అనుభవం, చుట్టూ వాతావరణం, వ్యక్తుల ప్రభావంతో క్రమంగా ఆ భయం పోయింది. గట్టిగా అనుకుంటే ఏమైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకొన్నాను, వాటితో ఫలితాల్ని సొంతం చేసుకున్నా. తెలియని భాషలో డబ్బింగ్‌ చెప్పుకోవడం, సవాళ్లతో కూడిన కథల్ని ఎంపిక చేసుకోవడం లాంటివి అందులో భాగమే’’ అంది కీర్తి. అయితే కొన్ని విషయాల్లో అసలు మారకూడదని పరిశ్రమకి వచ్చే ముందు అనుకొన్నా, దాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకొని నాకు నప్పే పాత్రల్లో నటిస్తూ ప్రయాణం చేస్తున్నానని చెప్పింది కీర్తి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.