‘కితకితలు’ సీక్వెల్‌ టైటిల్‌ అదే: అల్లరి నరేష్‌
కరోనా దెబ్బ అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమపైనా తీవ్రంగానే ప్రభావం చూపించింది. ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమలోనూ చిత్రీకరణలు లేవు. కరోనా కాటుకు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ విరామంలో వారంతా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల్ని పలకరిస్తున్నారు. తాజాగా ప్రముఖ హాస్య కథానాయకుడు అల్లరి నరేష్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేక్షకులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్లుగా నిలిచిన ‘సుడిగాడు’, ‘కితకితలు’ సీక్వెల్‌ల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.



‘‘సుడిగాడు’ సీక్వెల్‌ తియ్యాలన్న ఆలోచన ఉంది. కానీ, దీనికి కొనసాగింపు అంటే ఆ కథ తొలి భాగాన్ని తలదన్నేలా ఉండాలి. అలాంటి కథ దొరికితే కచ్చితంగా ‘సుడిగాడు 2’ చేస్తా’’ అన్నారు నరేష్‌. ఇక ‘కితకితలు’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు సీక్వెల్‌ తియ్యాలన్న దానిపై అంత సీరియస్‌గా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ, సరదాగా ‘పకపకలు’ అని ఓ ప్రయోగాత్మక కథ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఉండేది. కానీ, అది ఎంత వరకు సాధ్యమవుతుంది? అన్న దానిపై ఇంత వరకు ఆలోచన చెయ్యలేదు’’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘నాంది’ అనే ఓ థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. దీంతో పాటు ‘బంగారు బుల్లోడు’ అనే మరో చిత్రం పూర్తి చేశారు. అది వేసవి కానుకగా విడుదల కావల్సి ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.