నా జీవితంలో వచ్చిన మార్పేమీ లేదు.
సెట్‌లో ఒక పక్క మేకప్‌ వేస్తుంటే, మరో పక్క పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుతోపాటు... తొలి సినిమాని పూర్తి చేసింది రష్మిక. అది విడుదలైంది, రష్మిక బిజీ కథానాయికైంది. తెలుగులో కూడా పరిచయమైన తొలి యేడాదిలోనే మూడు సినిమాలు చేసింది, స్టార్‌ కథానాయిక స్థాయికి చేరిపోయింది. ఇలా అనూహ్యంగా గుర్తింపు, విజయాలు, అవకాశాలు వచ్చినప్పుడు జీవితం ఒక్కసారిగా మారినట్టు అనిపిస్తుంది ఎవ్వరికైనా. మరి మీరెలా ప్రభావితం అయ్యారని రష్మికని అడిగితే... ‘‘నిజంగా నా జీవితంలో వచ్చిన మార్పంటూ ఏమీ లేదండీ’’ అని సమాధానమిస్తోంది. ‘‘నటనపై ఎప్పట్నుంచో మక్కువ ఉండేది. మోడలింగ్‌ వల్ల కెమెరా ముందు ఎలా నడుచుకోవాలో కూడా అలవాటైంది. అయినా సరే, సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకు వెళుతున్నప్పుడు తెలియని కంగారు మొదలైంది. మొదటి సినిమా చేస్తున్నన్ని రోజులు ఓ కొత్త ప్రపంచంలో ఉన్నట్టే అనిపించేది. ఆ తర్వాత నుంచి మామూలే. కానీ కొన్ని విషయాల్లో మారాలని ఉంది. ఇప్పుడు కూడా కెమెరా ముందుకు వెళుతున్నప్పుడు కాస్త భయంగా ఉంటుంది. వేదికలపై కూడా సిగ్గుపడిపోతుంటా. ఆ విషయాల్లో కాస్త మార్పొస్తే బాగుంటుంద’’ని సెలవిచ్చింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘భీష్మ’ చిత్రాల్లో నటిస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.