మాస్‌రాజానా.. మెగా హీరోనా??

సందేశాత్మక కథలని కూడా వాణిజ్యాంశాలు నిండిన వినోదాత్మక కథలుగా మలచడంలో దర్శకుడు మారుతిది అందెవేసిన చేయి. తాజాగా ఆయన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో తాతా మనవళ్ల అనుబంధాల గొప్పతనాన్ని ఎంతో వినోదాత్మకంగా అంతే భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించి మెప్పించాడు. ఇప్పుడీ ఉత్సాహంలోనే ఈ విలక్షణ దర్శకుడు తన తర్వాతి చిత్రాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఇద్దరు కథానాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాళ్లు మరెవరో కాదు.. మాస్‌ మహారాజా రవితేజ, మరొకరు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. అయితే వీటిలో గట్టిగా వినిపిస్తున్న పేరు మాత్రం వరుణ్‌ తేజ్‌దే. గతేడాది ‘ఎఫ్‌2’, ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రాలతో వరుస హిట్లు అందుకొన్న వరుణ్‌.. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది బాక్సింగ్‌ నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం. ఇప్పుడీ చిత్రం పూర్తయిన వెంటనే వరుణ్‌తో తన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే ఈ మెగా ప్రిన్స్‌కు సరిపోయే చక్కటి కథను రెడీ చేసి ఆయనకు వినిపించారని వినికిడి. ఇక ఇదే సమయంలో రవితేజ కోసం కూడా మారుతి ఓ వైవిధ్యభరిత కథను సిద్ధం చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాస్‌రాజా కూడా ‘క్రాక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా సెట్స్‌ నుంచి బయటకొస్తే వాళ్లతో సినిమాను చేయాలని మారుతి ప్లానింగ్‌ వేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒకేసారి ఇద్దరినీ లైన్లో పెట్టుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారట మారుతి. మరి ఈ ఇద్దరిలో మారుతి ముందుగా ఎవరితో జట్టు కడతారో తెలియాలంటే? మరికొంత కాలం వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.