అప్పుడే అడ్వాన్స్‌ తీసేసుకున్నారా??

‘కెజిఎఫ్‌’ వంటి భారీ యాక్షన్‌ డ్రామా చిత్రంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని ముస్తాబు చేసే పనిలో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ఇది తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే తర్వాతి చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రశాంత్‌. ఇప్పటికే ఈ యువ దర్శకుడికి జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకోని తెలుగులో పలు నిర్మాణ సంస్థలు ఆయన్ని బుక్‌ చేసుకునేందుకు రంగంలోకి దిగాయి. అయితే ఆయన ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నట్లు చిత్ర సీమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ల కలయికలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని ముస్తాబు చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్‌కు రూ.2కోట్లు అడ్వాన్సు ముట్టజెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది 2022లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్‌ రాజమౌళి, త్రివిక్రమ్‌ల చిత్రాలు పూర్తి చెయ్యనున్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.