నానిలో నిజంగానే ఓ రచయిత ఉన్నాడట..

‘జెర్సీ’లో అర్జున్‌ అనే క్రికెటర్‌గా ఓ చక్కటి భావోద్వేగాల ప్రయాణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్‌’ కోసం పెన్సిల్‌ అనే పార్థసారథి రూపంలో నవ్వుల విందును వడ్డించబోతున్నాడు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం మీడియా ముందుకొచ్చారు నాని. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితంకు సంబంధించి కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తెరపైనే కాక నిజ జీవితంలోనూ తనలో ఓ రచయిత ఉన్నాడని.. వాడు అప్పుడప్పుడూ బయటకొస్తుంటాడని తెలియజేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘దర్శకత్వ విభాగం నుంచి వచ్చినవాడినే కాబట్టి నాలోనూ ఓ పార్థసారథి ఉన్నాడు. వాడు అప్పుడప్పుడూ బయటకొస్తుంటాడు. అలాగని తను ట్రైలర్‌లో చెప్పినట్లు ‘‘ఆకలేస్తే అక్షరాలు తింటాం, చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’’ అనేంత గొప్ప రచయిత కాదు. నాకు సెట్స్‌లో విరామం దొరికితే నాకొచ్చిన మంచి ఆలోచనల్ని ఫోన్‌లో రాసుకుంటుంటా. ‘దేవదాస్‌’ సమయంలో నా గురించి నాగార్జున గారు సరదాగా ‘నాని ఎప్పుడూ ఫోన్‌లో ఉంటాడు’ అన్నారు. నాకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని నా ఫోన్‌లోనే రాసుకుంటాను. అయితే నాగ్‌ సర్‌ అలా అన్నాక.. మా స్నేహితులంతా ‘అందరూ నాని ఫోన్‌తోనే గడుపుతుంటాడని చెబుతారు. మరి మా సందేశాలకు స్పందించవేంటి?’ అని అడగడం మొదలుపెట్టారు. దీంతో వారికి కూడా నాలోని రచయిత గురించి వాడి ఫోన్‌ కథను చెప్పా’’ అని తనలోని రైటర్‌ గురించి చెప్పుకొచ్చారు నాని. అంతేకాదు ఇక్కడ మరో ఆసక్తికర విషయమూ ఉంది. ఆయన తన ఆలోచనలను అప్పుడప్పుడూ తనకు నమ్మకమైన దర్శకులతో పంచుకుంటూ ఉంటాడట. దాని ఆధారంగా కథలు సిద్ధం చేయమని చెబుతుంటాడట. దీన్ని బట్టీ చూస్తుంటే నాని త్వరలోనే తన సొంత కథలో తాను కనిపించినా ఆశ్చర్యపోవక్కర్లే. ప్రస్తుతం తనకు ఎలాగూ సొంత నిర్మాణ సంస్థ ఉంది కాబట్టి తన చిత్రాన్ని తానే చక్కగా నిర్మించుకోవచ్చు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.