ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణమిదే!

నయనతార.. ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయిక. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే దక్షిణాదిలో ఆమె లేడీ సూపర్‌ స్టార్‌. చిత్రసీమలో ఇంతలా వెలుగులు చిందిస్తున్న నయన్‌ మీడియాలో కనిపించేది మాత్రం చాలా తక్కువే. ఎప్పుడైనా ప్రేక్షకులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. సోషల్‌ వాల్‌పై సందడి చేస్తుందే తప్ప మీడియాలకు ఇంటర్వ్యూలు అస్సలు ఇవ్వదు. నయన్‌ ఇలా మీడియాకు దూరంగా ఉండటానికి కారణం.. ఆమె మనసుకు తగిలిన ఓ గాయమేనట. ఈ విషయాన్ని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘‘చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో మీడియాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేదాన్ని. కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించింది. అది నా మనసును చాలా బాధపెట్టింది. ఆ గాయం కారణంగానే మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నా. ఈ పదేళ్లలో నేను ఎవరికీ ఇంటర్వ్యూలు కానీ, వీడియో బైట్స్‌ కానీ, ఇవ్వలేదు. నటిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడుతుంటా. చిత్రసీమ అంటే మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఈ విషయంలో నేనెప్పుడూ సర్దుకుపోలేదు. నా మనసుకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటుంటా. షూటింగ్స్, కాస్ట్యూమ్, మేకప్‌.. ఇలా ప్రతి విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలోని వాళ్లు నా గురించి ఏమనుకుంటారు? అని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నాకు నచ్చినట్లు జీవిస్తున్నా.’’ అంటూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది నయన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.