వీర రాఘవుడి పక్కన.. సునీల్‌ని చూశారా!
‘‘కంటబడ్డావా.. కనికరిస్తానేమో! యెంటబడ్డానా.. నరికేస్తావోబా..’’ అంటూ అదిరిపోయే యాక్షన్‌ హంగామాతో ‘అరవింద సమేత’ టీజర్‌ను సినీ ప్రియులకు అందించాడు ఎన్టీఆర్‌. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టీజర్‌.. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. నాగబాబు, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో జగపతిబాబు కనిపించనప్పటకీ.. బ్యాగ్రౌండ్‌లో వినిపించిన ఆయన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ టీజర్‌ ద్వారా ఓ అనుకోని అతిథి కూడా సినీ ప్రియులకు దర్శనమిచ్చాడు. అతను మరెవరో కాదు నటుడు సునీల్‌. అదేంటి టీజర్‌ మొత్తం చూశాం.. మాకు ఎక్కడా కనిపించలేదే అనుకోకండి.. కాస్త జాగ్రత్తగా చూస్తే కనిపిస్తాడు. టీజర్లో ఓ యాక్షన్‌ సన్నివేశంలో ఎన్టీఆర్‌ కుర్చీతో పాటు గాల్లోకి లేస్తాడు కదా.. ఆ సీన్‌లోనే ఓ పక్కగా నుంచోని ఉన్న సునీల్‌ కనిపిస్తాడు. అయితే ‘అరవింద సమేత’లో సునీల్‌ కమెడియన్‌గా కనిపిస్తాడా లేక ఎన్టీఆర్‌కు స్నేహితుడిగా నటిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్‌ - సునీల్‌ల స్నేహ బంధం ఈనాటిది కాదు. సునీల్‌ హాస్యనటుడిగా ఉన్నప్పుడు.. త్రివిక్రమ్‌ తన ప్రతి సినిమాలో అతనికి ఛాన్సులు ఇచ్చేవాడు. అయితే ప్రస్తుతం సునీల్‌కు హీరోగా వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో.. తిరిగి తన మిత్రుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే హాస్యనటుడిగా రీఎంట్రీకి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం సునీల్‌, అల్లరి నరేష్‌లు కలిసి ‘సిల్లీఫెలోస్‌’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.