నేనొద్దనుకున్నా చిత్ర పరిశ్రమ పిలిచింది!

‘‘నేను నటిని కావాలని ఎప్పుడూ ఆశ పడలేదు’’ అంటోంది నిత్యా మేనన్‌. ‘సినిమాల్లోకి రావాలి అనుకున్నాక.. తొలినాళ్లలో మీకెదురైన సవాళ్లేంటి? ఎన్ని ఆడిషన్స్‌లో విఫలమయ్యారు?’ అని అడగ్గా ‘‘అసలీ ప్రశ్న నాకు వర్తించద’’ని బదులిచ్చింది నిత్య. ‘‘నాకు మొదటి నుంచీ చదువుపైనే ఆసక్తి ఉండేది. మాస్టర్స్‌ చేయాలి. పీహెచ్‌డీ పూర్తిచేసి, విదేశాలకు వెళ్లిపోయి మంచి ఉద్యోగం చేసుకోవాలి... లాంటి ఆలోచనలే ఉండేవి. నటిని కావాలని అసలెప్పుడూ అనుకోలేదు. కానీ, విధి రాతను మార్చలేం కదా. నేనొద్దనుకున్నా చిత్ర పరిశ్రమ నన్ను పిలుచుకుంది. నేనెలాంటి ప్రయత్నం చేయకుండానే నటిగా నాకు ఆఫర్లు వచ్చాయి. అందుకే నాకు ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశమూ రాలేదు, నన్నెవరూ వద్దనే ఛాన్సూ రాలేదు. నా దగ్గరకొచ్చిన కథల్లో ఏదైనా నా మనసుకు నచ్చితే చేసేదాన్ని, లేదంటే వద్దని చెప్పేదాన్ని. ఏదో మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానే కానీ, నాలుగేళ్ల క్రితం వరకూ నటనను నేను సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. నా ప్రతిభను నిరూపించుకోవడానికిది గొప్ప వేదిక. ఇది చాలా శక్తిమంతమైన మాధ్యమం కూడా. నేనెందుకు ఈ అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకూడదు అనుకున్నా. అప్పటి నుంచే నటన పట్ల మరింత సీరియస్‌గా దృష్టి పెట్టా’’ అని చెప్పింది నిత్య. ప్రస్తుతం ఆమె అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్‌ 2’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఓ వైవిధ్యభరిత క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈచిత్రం జులై 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.