అలా ఉండటానికే ఇష్టపడతా: నివేదా

‘‘కథానాయికగా ఎంత స్టార్‌డం వచ్చినా.. ఎంత డబ్బు సంపాదించినా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయిలా ఉండటానికే ఇష్టపడతా’’ అంటోంది నివేదా థామస్‌. ‘జెంటిల్‌మెన్‌’తో తెలుగు తెరపై కాలుమోపిన ఈ అమ్మడు.. ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొని మంచి నాయికగా మారిపోయింది. ‘నివేదా.. వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండటానికి ఇష్టపడుతుంది?’ అని ప్రశ్నిస్తే.. ‘‘నాకెప్పుడూ సింపుల్‌గా జీవించడమంటేనే ఇష్టమ’’ని బదులిచ్చింది. ‘‘నేనూ అందరిలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సాధారణ అమ్మాయినే. చిన్నప్పుడు బయటకెళితే నచ్చిన వస్తువుల్ని కొనివ్వమని అడిగేదాన్నంట. ‘మన దగ్గర డబ్బు లేదమ్మా’ అని నాన్న చెప్పారంటే ‘పర్లేదులే నాన్నా.. ఉన్నప్పుడు కొందాం’ అని వదిలేసేదాన్నట. బెట్టు చెసేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా సరదాగా ‘నాకది కావాలి, ఇది కావాలి’ అని అల్లరి చేస్తే.. ‘అదేంటి చిన్నప్పుడు అలా ఉండేదానివి. ఇప్పుడు ఇలా అయిపోయావు’ అని గుర్తుచేస్తుంటారు. ఇక వాళ్లు అలా అన్నాక మనం ఏం చేస్తాం చెప్పండి? నా ఇమేజ్‌ను పాడు చేసుకోవడమెందుకని సర్దుకుపోతుంటా’ అని నవ్వేసింది. నివేదా ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటించింది. నాని, సుధీర్‌ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.