ఓటీటీని అధిగమించేందుకు.. బార్‌ థియేటర్లు?

ప్రేక్షకుడిని మెప్పించడం తర్వాత... అసలు థియేటర్‌ వరకూ రప్పించడం ఎలా? నట్టింట్లోనే సినీ వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీతో పోటీలో నెగ్గాలంటే థియేటర్‌లో సినిమాతో పాటు ఇంకేం అనుభూతులు అందించొచ్చు? ఇదీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న వేడి వేడి చర్చ.


సినిమాకి సవాళ్లు కొత్త కాదు. తొలుత బుల్లితెర, ఆ తర్వాత పైరసీ.. ఇలా ప్రతి మలుపులోనూ గట్టి పోటీనే ఎదుర్కొంది. అన్నింటిపైనా పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఓటీటీలతో కొత్త సవాల్‌ ఎదురైంది. అవి నట్టింట్లోకే వినోదాన్ని తీసుకురావడంతో థియేటర్‌ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ‘బొమ్మ చాలా బాగుంద’ంటే తప్ప   ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం లేదు. ఫలితంగా బాగున్న సినిమాలు మాత్రమే వసూళ్లు సాధిస్తున్నాయి. పర్వాలేదు అనిపించే సినిమాలూ దారుణమైన నష్టాల్ని చవిచూస్తున్నాయి. దీంతో దర్శకనిర్మాతలు మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఓటీటీలో కంటెంట్‌ని మించిన అనుభూతి ఇవ్వడం కోసం కథా   బలమున్న చిత్రాల్ని.. భారీ హంగులతో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ చిత్రాల్ని తీస్తూ ప్రేక్షకుడిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్లలో విడుదలైన నెల తర్వాత ఓటీటీలోనూ విడుదల చేస్తూ వాటిని మరో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కానీ కరోనా ప్రభావం మొదలయ్యాక పరిస్థితులు మారిపోయాయి. అప్పటిదాకా కొంతమంది ప్రేక్షకులకే పరిమితమైన ఓటీటీలకి, ఇప్పుడు మరింత మంది దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు ఓటీటీలను కాదని ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం ఎలా అన్నదే దర్శకనిర్మాతల్ని తొలుస్తున్న ప్రశ్న. ఒకవైపు కరోనా భయాలు, మరోవైపు ఓటీటీ వినోదాలు... ఈ రెండింటినీ దర్శకనిర్మాతలు సవాల్‌గా తీసుకున్నారు. ప్రేక్షకుడి భద్రతపై భరోసా కల్పించడంతోపాటు వాళ్లని థియేటర్లవైపు మరింతగా ఆకర్షించేలా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.త్వరలోనే నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు ఓ వెబినార్‌ని నిర్వహించి వీటిపై చర్చలు జరపబోతున్నారు. ఆ చర్చల్లో బార్‌ థియేటర్ల ఏర్పాటు అంశం కూడా కీలకం కానున్నట్టు సమాచారం.  

ముందు ధైర్యం ఇవ్వడంపైనే

సినిమా థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే థియేటర్లు తెరచుకున్నాక ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది? వాళ్లు ఇదివరకటిలాగా ధైర్యంగా థియేటర్‌కి వస్తారా? దీనిపైనే ప్రధానంగా సినీ వ్యాపార వర్గాలు దృష్టి సారించాయి. కరోనా ప్రభావం దృష్ట్యా ముందు ప్రేక్షకుడిలో ధైర్యం నింపడంపైనే దృష్టి పెట్టబోతున్నారు. థియటర్‌కి వెళ్లడం సురక్షితమే అనే భరోసా ప్రేక్షకుడికి ఇవ్వడం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై పరిశ్రమ వర్గాలు ఆలోచిస్తున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు, భౌతికదూరం తదితర విషయాలు పక్కాగా ఉండేలా ఏం చేయాలో వెబినార్‌లో చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఆ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

విదేశీ తరహా సదుపాయాలు

ఇప్పటివరకూ థియేటర్‌లో పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్‌ లాంటివే దొరుకుతున్నాయి. అక్కడ మద్యం కూడా లభించేలా ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా నిర్మాతలు, ప్రదర్శనకారుల మధ్య చర్చ జరగబోతోంది. ‘‘ప్రేక్షకులకు వైన్‌, బీర్‌ అందుబాటులోకి తెచ్చేలా థియేటర్లు లైసెన్స్‌ పొందితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా?’’ అంటూ ట్విటర్‌లో చర్చను లేవనెత్తారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. థియేటర్‌కి వచ్చే కుటుంబ ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘కుటుంబ ప్రేక్షకులు దూరమైపోతారన్న మాట నిజమే. అయితే ఈ ఆలోచనని కొన్ని మల్టీప్లెక్సుల్లో అమలు చేయడానికి ఆస్కారం ఉండొచ్చేమో’’ అన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లోని థియేటర్లలో ఈ విధానం అమలులో ఉందట. అలా మన దగ్గరా ఆ వెసులుబాటు కల్పిస్తే ఎలా ఉంటుందనే విషయమై వెబినార్‌లో చర్చ జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ధ్రువీకరించారు. అయితే ఏ ఆలోచనకైనా ప్రభుత్వ అనుమతి లభిస్తేనే సాధ్యమవుతుందన్నారు.

థియేటర్లలోనే వేడుకలు..

నిజానికి ఓటీటీ ప్రభావం కొత్తగా వచ్చిందేమీ కాదు. కరోనా ప్రభావానికి ముందు కూడా థియేటర్లు వెలవెలబోయాయి. అయితే వేసవి సీజన్‌తో పుంజుకుంటుందనే ఆశ సినీ వర్గాల్లో ఉండేది. అంతలోనే లాక్‌డౌన్‌ మొదలైంది. ఈ విరామంలో ఓటీటీ మరింత ప్రభావం చూపించడం మొదలైంది. నేరుగా అందులోనే సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్ల వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చిన ఓటీటీ ఉద్ధృతిపై గట్టిగా దృష్టి పెట్టాలని చిత్రసీమ నిర్ణయించింది. థియేటర్‌లో సినిమా వీక్షణతో పాటు మరిన్ని అనుభూతులను ప్రేక్షకులకు అందించే యోచనతో ఉంది.అందులో భాగంగా థియేటర్లని సృజనాత్మకంగా మార్చాలని భావిస్తోంది. అక్కడ ఆయా సినిమాల కథల గురించి చర్చించుకునేలా, వేడుకలు చేసుకునేలా, ఇలా థియేటర్లకి కొత్త హంగులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు జరగబోతున్నాయి.

‘‘థియేటర్‌ అంటే ఆఫీసుకు వెళ్లొచ్చినట్టుగా ఉండకూడదు. ఓ సెలవు రోజుని పూర్తిగా ఆస్వాదించిన అనుభూతి కలగాలి. ప్రేక్షకుడు ఇల్లు వదిలి థియేటర్‌కి రావడం కోసం, అక్కడ సినిమాని ఆస్వాదించడం కోసం ఏమేం చేయాలో వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఏసీ, మంచి సౌండ్‌ సిస్టమ్‌, ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌, మంచి పార్కింగ్‌ ప్రదేశం ఇలా థియేటర్లో చాలా సౌకర్యాలు పెరిగాయి. అవన్నీ ప్రేక్షకుడికి మంచి  అనుభవం ఇవ్వడం కోసమే. మంచి కంటెంట్‌ ఇస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ అందరికీ అనువుగా థియేటర్‌ని మార్చాలి. అభిమానులు థియేటర్‌ వస్తే వారికి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి? కుటుంబ ప్రేక్షకుల కోసం ఏం చేయాలి? అనే విషయాలపై ఆలోచిస్తున్నాం.అభిమానులు తెరపైన నటుల్ని చూస్తూ డ్యాన్స్‌ చేయడానికి ఫ్లోర్‌ల ఏర్పాటు, ఫ్యాన్స్‌ డేస్‌ పేరుతో ప్రదర్శనలు, అభిమాన హీరోలతో థియేటర్‌లోనే మాట్లాడటం ఇలాంటి వాతావరణముంటే ఎవరికైనా థియేటర్‌కి వెళ్లాలనే ఆసక్తి కలుగుతుందనేదే మా అభిప్రాయం. అలాగే కుటుంబ ప్రేక్షకుల కోసం, పిల్లల కోసం కొన్ని ప్రత్యేక థియేటర్లుండొచ్చు. విదేశాల్లో మైదానాల్లో కూడా బీర్లు తాగుతూ ఆటని ఆస్వాదిస్తుంటారు. అలా సినిమాని కూడా ఆస్వాదించేలా కొన్ని థియేటర్లు ఏర్పాటు చేయొచ్చు. దాంతో ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది కదా! ఇలాంటి ఆలోచనలతో చర్చలు జరుపుతున్నాం. చివరిగా వీటిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది’’.


- ‘ఈనాడు సినిమా’తో డి.సురేష్‌బాబుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.