అలా జరుగుంటే.. సౌందర్య బ్రతికేది

మహానటి సావిత్రి తర్వాత తెలుగు ప్రేక్షకుల మదిలో కథానాయికగా అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మరో నాయిక సౌందర్య అంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంటేష్‌ల వంటి అగ్రహీరోలు మొదలు జేడీ చక్రవర్తి, అలీ వంటి చిన్నహీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ ఆడిపాడిన క్రెడిట్‌ ఆమె సొంతం. ‘అమ్మోరు’ వంటి చిత్రంతో తెలుగు తెరపై నాయికా ప్రాధాన్య చిత్రాలకి ఓ ఊపు తీసుకొచ్చింది ఆమే. నాయికగా వెండితెరపై నటిగా కెరీర్‌ ఉజ్వలంగా వెలుగుతున్న దశలోనే ఓ హెలికాప్టర్‌ ప్రమాదం సౌందర్యను సినీప్రియులకు దూరం చేసింది. ఇప్పటికే ఆమె ఈ లోకాన్ని విడిచి దాదాపు దశాబ్దంన్నర కాలం దాటిపోయింది. ఇప్పుడీ అపురూప నటి మరణానికి సంబంధించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘పరుచూరి పలుకుల్లో’ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఆయన ‘వెంకీమామ’ చిత్రం గురించి చర్చిస్తూ.. సౌందర్య పేరును ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.


‘‘ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు సౌందర్య ఉంటే బాగుండేదనిపించింది. ఆమె దాదాపు వంద పైగా చిత్రాల్లో నటిస్తే వాటిలో ఎనిమిదిటికి మేం మాటలు రాశాం. తనని చూసినప్పుడల్లా నాకు ఇలాంటి ఓ సోదరి ఉంటే బాగుండేది అనిపించేది. 93లో ‘ఇన్స్‌పెక్టర్‌ ఝాన్సీ’ కోసం మేం తొలిసారి పనిచేశాం. అప్పుడామెలోని వినయం, పెద్దలకిచ్చే గౌరవం చూసి పెద్ద స్టార్‌ అవుతుందనుకున్నాం. తర్వాత ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినా ఆమె వినయంలో ఏ మార్పు రాలేదు. ఏమాత్రం గర్వం పెరగలేదు. సౌందర్య మరణం నాకు మరచిపోలేని జ్ఞాపకం. 2004 ఏప్రిల్‌ 17న నేను సాహిత్యంలో డాక్టరేట్‌ అందుకునే రోజు. నేను డాక్టర్‌రేట్‌ అందుకోవాలన్నది మా అమ్మ కల. ఆ కల తీరే సమయంలో నేను ఉస్మానియాలో ఉన్నా. అప్పుడే ఓ విలేకరి వచ్చి హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌందర్య మరణించారని విషాద వార్త నా చెవిన వేశారు. ఆ మాట వినగానే నేను చాలా షాక్‌కు గురయ్యా. చాలా బాధగా అనిపించింది. నిజానికి ఆ మరణం ఎవరూ ఊహించలేనిది. వాస్తవానికి ఆమె ఆరోజు విమానంలో రావాల్సి ఉంది. కానీ, ‘ఆప్తమిత్ర’ (తెలుగులో నాగవల్లి) షూటింగ్‌ కారణంగా ఆ విమానం మిస్‌ అయింది. దీంతో హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమైంది. ఒకవేళ ఆమె విమానం అందుకొని ఉండుంటే.. ఓ అద్భుత నటి మన నుంచి దూరమయ్యేది కాదు. నిజంగా ఆమె లోటు పూడ్చలేనిది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు పరుచూరి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.