40 రోజుల డేట్స్‌.. రూ.30కోట్ల పారితోషికం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగియడంతో పవర్‌స్టార్‌ వెండితెర రీ ఎంట్రీపై అప్పుడే గుసగుసలు మొదలైపోయాయి. గతేడాది ‘అజ్ఞాతవాసి’ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమైన పవన్‌.. ఇకపై తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేనట్లు కూడా ప్రకటించారు. కానీ, తాజాగా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్‌ ఈ ఏడాది చివర్లో తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పవన్‌ సమర్పించిన అఫిడవిట్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ వద్ద నుంచి కొంత మొత్తాన్ని అప్పు తీసుకున్నట్లు చూపించారు. ఇది ఆయన గతంలో వారి వద్ద నుంచి సినిమా కోసం తీసుకొన్న అడ్వాన్స్‌. దీన్ని పవన్‌ తిరిగి ఇచ్చేద్దామనుకున్నప్పటికీ మైత్రీ సంస్థ వారు సున్నితంగా తిరస్కరించారట. తనకు తీరిక ఉన్నప్పుడే మాకు ఓ మూవీ చేసిపెట్టమని ఆ సంస్థ నిర్మాతలు పవన్‌ను కోరారట. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పూర్తిగా చల్లారుతుంది కాబట్టి, పరిస్థితులకు తగ్గట్లుగా ఏడాది చివర్లో కొత్త మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారట పవన్‌. ఈ సినిమా కోసం ఆయన 40 రోజులు డేట్స్‌ ఇవ్వడానికి అంగీకరించారని, దీని కోసం మైత్రీ మూవీస్‌ రూ.30 కోట్ల పారితోషికం ముట్టజెప్పబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ ప్రాజెక్టు పక్కానా కాదా? నిజమే అయితే దర్శకుడు ఎవరు? వంటి విషయాలన్నీ తెలియాలంటే మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించేదాకా వేచి చూడాల్సిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.