టీజర్‌ చూసి పోర్న్‌స్టార్‌ అన్నారు.. రాత్రంతా ఏడ్చా!
‘‘బోల్డ్‌ కథాంశం.. బోల్డ్‌ సంభాషణలు.. కథలో ఓ కొత్తదనం.. ఇవన్నీ చూసినప్పుడే ఇలాంటివి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అనిపించింది. అందుకే ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ సినిమా చేశాను’’ అంటోంది పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తోనే సినీప్రియులకు సొగసుల విందు కొసరి కొసరి వడ్డించిన ఈ భామ.. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’తో కుర్రాళ్ల గుండెల్లో డైనమెట్లు పేల్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ విడుదలవగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా బోల్డ్‌ సన్నివేశాల్లో ఆమె కనిపించిన తీరు, సేప్టీ, సెక్స్‌ అంటూ ఆమె పలికిన బోల్డ్‌ డైలాగ్స్‌ సినీప్రియుల్ని విస్మయపరిచాయి. తాజాగా ఈ టీజర్‌కు నెట్టింట వచ్చిన స్పందన ఎలా అనిపించింది అని పాయల్‌ను ప్రశ్నించగా.. ఓ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. ఆ టీజర్‌కు నెటిజన్లు పెట్టిన కామెంట్లు చూసి రాత్రంతా ఏడుస్తూనే ఉందట పాయల్‌.


‘‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ టీజర్‌ విడుదలయ్యాక సాయంత్రం సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే. అన్నీ దారుణమైన కామెంట్లే ఉన్నాయి. ఒకరు నన్ను పోర్న్‌ స్టార్‌ అని కామెంట్‌ చేస్తే.. మరొకరు సిల్క్‌స్మితలా రెచ్చిపోతున్నావంటూ వ్యాఖ్యానించారు. మరికొన్నయితే దారుణంగా ఉన్నాయి. అవి చూసి రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానా అనిపించింది. ఈ చిత్రంతో ప్రజల్లో లైంగిక విజ్ఞానంపై ఓ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. టీజర్లో చూపించిన ఆ కొన్ని సన్నివేశాలే తెరపై కనిపిస్తాయి తప్ప. సినిమా అంతే అదే ఉండదు. దేశంలో మన మహిళలు చర్చించడానికి ఇష్టపడని సేఫ్టీ, పీరియడ్స్‌ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇందులో చర్చించాం. అది అందరికీ తెలియాలి. అదే విదేశాల్లో అయితే చిన్నతనం నుంచే పిల్లల్లో లైంగిక విద్యపై ఓ అవగాహన కల్పిస్తారు. అలాంటి వాతావరణం ఇక్కడ కూడా రావాలి’’ అని చెప్పుకొచ్చింది పాయల్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.