గజదొంగ అక్కగా రేణు.. ప్రతినాయికగా పాయల్‌!

పాయల్‌ రాజ్‌పుట్‌.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో ఒక్కసారిగా కుర్రకారు మదిలో కలల రాణీగా మారిపోయింది. తనదైన బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో చిత్రసీమ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ భామకు వరుస అవకాశాలు అందుతున్నాయి. కానీ, వచ్చిన ప్రతి కథను ఒప్పుకోవడం లేదు. ఆచితూచి అడుగులేస్తోంది. తాజాగా ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించబోయే ‘టైగర్‌ నాగేశ్వర రావు’ అనే బయోపిక్‌లో ప్రధాన పాత్రకు ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. దీనికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్‌ ఓ వేశ్య పాత్రలో కనిపించనుందని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఇప్పుడామె పాత్రకు సంబంధించి మరో ఆసక్తికర విషయం కూడా బయటకొచ్చింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’.. ఈ పేరు ప్రస్తుత తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ, 1980 - 90 దశకాల్లో ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిందనే చెప్పాలి. స్టూవర్టుపురం గజదొంగగా టైగర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇలాంటి భయంకరమైన గజ దొంగ పోలీసులకు పట్టుబడటానికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న వేశ్య మహిళే కారణమట. ఇప్పుడీ మూవీలో పాయల్‌ చేయబోతున్న వేశ్య పాత్ర కూడా అదేనట. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రానికి ఆమే ప్రతినాయిక అని తెలుస్తోంది. ఆమె పోలీసులతో కుమ్మకై నాగేశ్వరరావుకు మత్తు మందు ఇచ్చి అతను దొరికిపోయేలా చేస్తుందట. ఇక ఈ చిత్రంలో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. ఇందులో బెల్లంకొండకు అక్కగా రేణు దేశాయ్‌ కనిపించబోతుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకట వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.