గ్రాఫిక్స్‌కే అన్ని కోట్లు!!

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు ప్రభాస్‌. ఇప్పుడాయన నుంచి రాబోతున్న ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సైతం పాన్‌ ఇండియా చిత్రంగానే ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు డార్లింగ్‌కి ఉన్న ఈ పాన్‌ ఇండియా ఇమేజ్‌ను పాన్‌ యూనివర్సల్‌ ఇమేజ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కించబోయే తన కొత్త చిత్రాన్ని ఈ స్థాయి కథతోనే రెడీ చేస్తున్నారు నాగీ. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలైపోయాయి. ఏడాది ఆఖరు నాటికి ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఓ విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ఈ చిత్రం రూపొందనుందని, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ చిత్ర విఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే దాదాపు రూ.50కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్‌ తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 20వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్‌’, ‘ఓ డియర్‌’ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఉగాది కానుకగా ప్రభాస్‌ తొలి లుక్‌ విడుదల కాబోతున్నట్లు సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.