స్వీటీతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌

‘‘నాకు అభిమానుల ప్రేమను సంపాదించుకోవడమంటే ఇష్టం. నాకు ఈ ఆలోచనే లేకుంటే నేనింత కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటా’’ అన్నారు ప్రభాస్‌. కృష్ణంరాజు నటవారసుడిగా తెరపై అడుగుపెట్టినా.. ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి విజయాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. ఇక ‘బాహుబలి’ చిత్రాలతో ఆయన క్రేజ్‌ ప్రపంచవ్యాప్తమైంది. ఇటీవలే ‘సాహో’గా వచ్చి ప్రేక్షకులను అలరించిన డార్లింగ్‌ తాజాగా ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు అన్ని చిత్రసీమల్లో పనిచేయాలనుంది. నన్ను ప్రజలు ప్రేమించాలని కోరుకుంటా. అందుకే వాళ్ల ఆదరాభిమానాలను పొందడానికి ఎంతైనా కష్టపడుతుంటా. నాకీ ఆలోచన లేకపోతే ఇంత కష్టపడేవాడిని కాదేమో. ‘బాహుబలి’ చిత్రం కోసం 4ఏళ్ల సమయం కేటాయించినా.. ‘సాహో’ కోసం 2 ఏళ్ల పాటు కష్టపడినా.. ఇదంతా ప్రేక్షకుల ప్రేమను పొందడానికే. మరో విషయం నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ముఖ్యంగా సమాజంలోని ఓ సాధారణ వ్యక్తుల తరహా పాత్రలు, అండర్‌ డాగ్‌ క్యారెక్టర్లు చేయాలనుంది’’ అన్నారు. ఇక అనుష్కతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘అనుష్క చాలా అందమైన నటి. ‘బాహుబలి’లో నాకు జోడీగా దేవసేన పాత్రలో నటించింది. గతంలో మేమిద్దరం ఇతర చిత్రాల్లో కలిసి చేసినా.. ఈ సినిమాతో మా జోడీకి మరింత ఆదరణ లభించింది. అయితే ఇదే సమయంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని, తర్వలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ రకరకాల ఊహాగాన వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. దీనిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు మాత్రం ఆగట్లేదు. తను నాకు 11ఏళ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య ఇంతకంటే ఏమీ లేదు’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.