వెనకదే.. ముందుగా!

కథానాయకుడు ప్రభాస్‌ సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. ‘రాధే శ్యామ్‌’ తర్వాత ఆయన చెయ్యనున్న 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్, 22వ సినిమాని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కథ కథనాలు, బడ్జెట్‌ల పరంగానూ ఈ రెండు చిత్రాలు కళ్లు చెదిరే రీతిలోనే ఉండబోతున్నాయి. నాగీ చిత్రం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందనుండగా.. ఓం రౌత్‌ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంతో త్రీడీలో తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు పూర్వ నిర్మాణ పనులను ప్రారంభించేసుకున్నాయి. అయితే వీటిలో ముందుగా సెట్స్‌పైకి వెళ్లబోయేది మాత్రం ప్రభాస్‌ 22వ చిత్రం.. ‘ఆదిపురుష్‌’ అని తెలుస్తోంది. డార్లింగ్‌ సినిమాల లైనప్‌ ప్రకారం ఇది ఆయన 22వ చిత్రమైనప్పటికీ.. దర్శకుడు ఓం రౌత్‌ తెర వెనక పనులన్నీ శరవేగంగా చక్కబెడుతుండటానికి కారణమిదే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యముందని, చిత్రీకరణ దాదాపుగా బ్లూమ్యాట్‌ సెట్‌లోనే జరుగనున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకే నాగ్‌ అశ్విన్‌ సినిమా కన్నా ముందుగానే ఈ చిత్రాన్ని ఓ షెడ్యూల్‌ పూర్తి చేస్తే.. ఈలోపు దానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఓం రౌత్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాగీ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఒక నెల ముందుగానే ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రణాళిక రచిస్తున్నారట. అంతేకాదు ఈ చిత్ర గ్రాఫిక్స్‌ పనుల కోసం ఇప్పటికే కొన్ని ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర కథానాయికను కూడా ఫైనల్‌ చేసి.. సినిమాను పట్టాలెక్కించడానికి ఓ ముహూర్తం ఖరారు చెయ్యనున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.