‘ఆదిపురుష్‌’ కోసం అన్ని హంగులా?

కథానాయకుడు ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో తనకు దక్కిన ఈ మార్కెట్‌ను.. రానున్న కాలంలో మరింత పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు‌. దీనికి తగ్గట్లుగానే తన భవిష్యత్‌ ప్రాజెక్టులన్నింటినీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా భారీ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ 22వ చిత్రం ‘ఆదిపురుష్‌’ను హాలీవుడ్‌ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు ఓం రౌత్‌. రామాయణ నేపథ్యంతో సాగే ఈ కథలో డార్లింగ్‌ రాముడిగా కనిపించనుండగా.. లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ దర్శనమివ్వబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ త్రీడీ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. సినిమా చిత్రీకరణ దాదాపుగా బ్లూమ్యాట్‌లో జరుగనుంది. అందుకే ఈ గ్రాఫిక్స్‌ వర్క్స్‌ కోసం హాలీవుడ్‌లో ‘అవతార్‌’, ‘స్టార్‌ వార్స్‌’ వంటి చిత్రాలకు పనిచేసిన విఎఫ్‌ఎక్స్‌ బృందాల్ని సంప్రదిస్తోందట చిత్ర బృందం. సినిమాలో దాదాపు 40వేలకు పైగా గ్రాఫిక్స్‌ షాట్స్‌ ఉండనున్నాయని బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ చిత్ర బృందం గ్రాఫిక్స్‌ పనుల కోసమే దాదాపు రూ:250కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు సినిమా చిత్రీకరణ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలోనే బ్లూమ్యాట్‌ సెట్‌లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం అనుష్క శర్మను సంప్రదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.