కన్నుగీటు సుందరి లిప్‌లాక్‌ లొల్లి..
                                     

‘ఒరు ఆదార్‌ లవ్‌’లోని ఓ చిన్న కన్నుగీటు సన్నివేశంతో కోట్లాది కుర్రగుండెల్ని కొల్లగొట్టింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో వింక్‌ బ్యూటీగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకొని చిత్రసీమలోని అగ్ర తారామణులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ఒకే ఒక్క సన్నివేశంతో ఈ చిన్న చిత్రం కాస్త భారీ అంచనాలున్న సినిమాగా మారిపోయింది. త్వరలోనే ఈ మూవీ ‘లవర్స్‌ డే’ పేరుతో తెలుగు ప్రేక్షకులను మురిపించబోతోంది. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఓ చిన్న టీజర్‌ విడుదల చేసింది. కేవలం నిమిషంలోపు నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రియా ప్రకాశ్‌ - రోషన్‌ల మధ్య ఓ ఘాటైన లిప్‌లాక్‌ను చూపించారు. దీంతో ఇప్పుడీ లిప్‌లాక్‌ పుణ్యమాని ఈ చిత్రం మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లోకి వచ్చిన 24 గంట్లోనే కోటికి పైగా వీక్షణలు దక్కిచుకుంది. ఇదే సమయంలో 50,000లకు పైగా డిస్‌లైక్‌లు వచ్చాయి. అంతేకాదు టీజర్‌పై కొన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది సెక్సువల్‌ కంటెంట్‌తో కూడుకొని ఉన్న చిత్రం.. దీన్ని బ్యాన్‌ చేయాలంటూ’ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘‘అసలేంటి ఈ క్లిప్‌? ఇది రొమాన్సా.. లేక చీప్‌ పబ్లిసిటీ ట్రిక్కా?’’ అంటూ ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేయగా.. ‘‘ఇలాంటి చిత్రాలతో స్కూల్‌ పిల్లల్ని నాశనం చేయాలనుకుంటున్నారా’’ అంటూ మరో నెటిజన్‌ తిట్టిపోశారు. ఏదేమైనా ఓ లిప్‌లాక్‌ సీన్‌తో మరోసారి ‘లవర్స్‌ డే’ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది ప్రియా ప్రకాశ్‌. ఈ భామ త్వరలోనే ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ విడుదలవగా.. దానిపైనా తీవ్రస్థాయిలో వివాదాలు చేలరేగాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.