అనుష్కకి అలా పేరు పెట్టాం: పూరి

చిత్రసీమలో కథానాయికల కెరీర్‌ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్లు అర్ధ దశాబ్దం నిలవగలిగితేనే గొప్ప అనుకునే రోజులివి. శ్రియ, అనుష్క, కాజల్, సమంత, తమన్నా వంటి కొందరు నాయికలు మాత్రమే దశాబ్ద కాలం పూర్తి చేసుకోని ఇప్పటికీ ఎంతో చక్కగా కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక వీళ్లలో అనుష్క కెరీర్‌ మరింత ప్రత్యేకం. ‘సూపర్‌’తో వెండితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు ఈ ఏడాదితో పరిశ్రమలో 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘నిశ్శబ్దం’ చిత్ర బృందం అనుష్క 15ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెతో పనిచేసిన పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరై స్వీటీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు పూరి జగన్నాథ్‌ అనుష్క గురించి మాట్లాడుతూ ఆమె పేరు వెనుక రహస్యాన్ని బయటపెట్టారు.

‘‘సూపర్‌’ చిత్రం కథానాయిక పాత్ర కోసం ముంబై వెళ్లినప్పుడు స్వీటీని తొలిసారి కలిశా. నేను హోటల్‌లోకి వెü™్ల సరికి తను లాబీలో ఎదురు చూస్తోంది. అందమైన లుక్స్‌తో మంచి ఒడ్డు పొడుగుతో ఆకట్టుకునేలా కనిపించింది. తనని ఫోటో ఇవ్వమంటే స్టాంప్‌ సైజ్‌ కన్నా చిన్నగా ఉన్న ఓ ఫొటోను ఇచ్చింది. అప్పుడే అర్థమైంది.. తను సినిమా పక్షి కాదని. యాక్టింగ్‌ వచ్చా? అని అడిగాను. తెలీదు అంది. చెయ్యగలవా? అన్నాను. ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తానో లేదో తెలియదు అంది. డాన్స్‌ కూడా తెలియదని చెప్పింది. అప్పుడు మా ఆవిడ పైన హోటల్‌ రూమ్‌లో ఉంటే ఫోన్‌ చేసి చెప్పాను. తను కిందకి వచ్చి చూసి అమ్మాయి పొడవుగా బావుందని చెప్పింది. సినిమాలో పెట్టేదామని అంది. నువ్వు ఏం చేస్తున్నావని అంటే నేనొక యోగా టీచర్‌ని అంది. సరే! నాతో ఆర్నెల్లు హైదరాబాద్‌కి రమ్మంటే వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లి నాగార్జున గారిని కలిపించా. ఆయన అనుష్కను చూడగానే అమ్మాయి చాలా బావుందన్నారు. ఆడిషన్‌ చేద్దామని అంటే.. అదేం వద్దు సినిమాలో యాక్ట్‌ చేయించేద్దామని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్‌ బాల దగ్గర తను యాక్టింగ్‌ నేర్చుకుంది. తన పేరు స్వీటీ అని పాస్‌ పోర్టులో ఉండటాన్ని చూసిన నాగ్‌.. మంచి పేరు పెట్టమని అన్నారు. అప్పుడే ‘‘మిల మిల..’’ పాట పాడటానికి ఓ అమ్మాయి వచ్చింది. తన పేరేంటి అని కనుక్కుంటే.. అనుష్క అని చెప్పింది. ఈ పేరు బావుందే అని నాగ్‌కి చెబితే బావుంది. అదే పేరు పెట్టేసెయ్‌ అన్నారు. అలా స్వీటికి అనుష్క అనే నామకరణం చేశాం. మంచితనం, తెలివితేటలు కలగలిసి ఉన్న వ్యక్తి ఆమె. ‘సూపర్‌’తో స్టార్ట్‌ అయ్యి.. ‘నిశ్శబ్దం’ వరకు వచ్చింది. తనకు హ్యాట్సాప్‌’’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు పూరి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.