ఆ నమ్మకంతోనే ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టా

‘‘సినీ నేపథ్యమున్న వాళ్లెవరూ మా కుటుంబంలో లేరు. ఎవరి అండ లేకుండా నాపై నాకున్న నమ్మకంతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టానని’’అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. సినిమా ప్రయాణం గురించి రకుల్‌ స్పందిస్తూ..‘‘వచ్చిన అవకాశాలు నిలబెట్టుకున్నా. వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడిపే స్థాయికి వెళ్లాలి అనుకున్నా. ఇప్పుడలాంటి ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. కథానాయికల సినీ కెరీర్‌ చాలా తక్కువ ఉంటుందని అంటుంటారు. నేనూ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఓ ఐదేళ్లయినా నా స్పీడు చూపించగలిగితే చాలనుకున్నా. కానీ, భగవంతుడి ఆశీర్వాదం, అభిమానుల ఆదరాభిమానాల వల్ల దశాబ్ద సినీ ప్రయాణానికి దగ్గరవుతున్నా. ఒక్కోసారి దీని గురించి ఆలోచిస్తుంటే ఏదో ఓ చక్కటి కలలా అనిపిస్తుంటుంది. కానీ, నటిగా నన్ను నేను మరింత సాన బెట్టుకోవాల్సి ఉంది. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. అందుకే చేసే ప్రతి సినిమా నీ నా తొలి చిత్రమనుకొనే కష్టపడుతుంటానని’’ చెప్పింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.