మాస్‌రాజా కొత్త చిత్ర కథ ఇదేనట..

మాస్‌ మహారాజా రవితేజ సినిమాల విషయంలో వేగం పెంచారు. ఇప్పుడాయన ‘డిస్కోరాజా’ సెట్స్‌పై ఉండగానే మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ‘ఆర్‌.టి. 66’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘డాన్‌ శీను’, ‘బలుపు’ వంటి హిట్ల తర్వాత గోపీ దర్శకత్వంలో మాస్‌రాజా చేస్తోన్న మూడో చిత్రమిది. అందుకే దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర కథ విషయమై నిన్నమొన్నటి వరకు రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ చిత్రాన్ని తమిళ హిట్‌ మూవీ ‘తెరి’కి రీమేక్‌గా రూపొందిస్తున్నారని, దీనికి తగ్గట్లుగానే రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌గా దర్శనమివ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై చిత్ర దర్శకుడి నుంచి క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను సొంత కథతోనే తెరకెక్కిస్తున్నట్లు, వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ కథను అల్లుకున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం నుంచి అందిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో మాస్‌రాజాకు జోడీగా శ్రుతిహాసన్‌ నటించనుండగా.. తమన్‌ స్వరాలు సమకూర్చనున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.