‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం అన్ని కోట్లు ఇస్తున్నారా!!

హిందీ చిత్రసీమలో మిగతా నాయికలతో పోల్చితే సొట్టబుగ్గల సుందరి ఆలియా భట్‌ జోరే ఎక్కువగా కనిపిస్తోంది. ఓవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలతో సత్తా చాటుతూనే స్టార్‌ హీరోలతో ఆడిపాడుతూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ‘రాజీ’ చిత్రంతో రూ.100 కోట్ల కథానాయిక అనిపించుకున్న ఈ పాల బుగ్గల సుందరి.. ఇటీవలే ‘గల్లీబాయ్‌’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ భామ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‌కు జోడీగా సీత అనే పాత్రలో ఆలియా కనువిందు చేయబోతుంది. ఇప్పుడీ పాత్ర కోసం ఆలియా తీసుకోబోతున్న పారితోషికం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ చిత్రం దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్న నేపథ్యంలో.. సినిమాలోని తన పాత్ర కోసం దాదాపు రూ.10- 15 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తోందట ఆలియా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో ఒక్కో చిత్రానికి గానూ రూ.7- 10 కోట్ల వరకు తీసుకుంటుండగా.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం రూ.12 కోట్ల వరకు అందుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్‌లో ఆలియాకున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోని నిర్మాత దానయ్య కూడా ఆమె అడిగినంత ముట్టజెప్పేందుకు అంగీకరించినట్లు సమాచారం. దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం.. 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.