‘నాని 24’లో ఆర్‌ఎక్స్‌ హీరో..
‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర విజయమిచ్చిన ఉత్సాహంతో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ప్రస్తుతం ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను నిర్మిస్తున్న ‘హిప్పీ’లో నటిస్తూనే.. బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు కార్తికేయ. ప్రస్తుతం ఈ రెండూ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను కొట్టేశాడట ఈ యువ హీరో. నాని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించబోతున్న కొత్త చిత్రంలో ఓ కీలక పాత్రలో కార్తికేయ కనిపించబోతున్నాడట. ఇంతకీ ఆ కీలక పాత్ర ఏంటంటే నానికి ప్రతినాయకుడిగా కనిపించడం. ఈ చిత్ర కథ రిత్యా విలన్‌ పాత్ర కోసం ఓ హ్యాండ్సమ్‌ హీరోను వెతుకుతుండగా.. ఆ ప్రయత్నాల్లో భాగంగా కార్తికేయను సంప్రదించాడట దర్శకుడు విక్రమ్‌. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో నాని - విక్రమ్‌లతో కలిసి పనిచేసే అవకాశం దొరకండంతో కార్తికేయ కూడా ఏమాత్రం ఆలోచించకుండా విలన్‌ పాత్రకు ఓకే చెప్పేశాడట. ఈ సినిమా కోసం ఇప్పటికే తన కాల్షీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నాడట ఈ క్రేజీ హీరో. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ సినిమా ఫిబ్రవరి 19 నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.