ఆ ఛేజింగ్‌ సీన్ల వెనుక అంత కష్టముందట!!

ఒకసారి రాజమౌళి సినిమా సెట్స్‌ నుంచి బయటకు అడుగుపెట్టాక.. సదరు హీరోలపై ఏర్పడే అంచనాలను అందుకోవడం ఎవరికైనా అసాధ్యం. ఇది ఒకరకంగా ఆ హీరోల తర్వాతి కెరీర్‌పై ఓ తెలియని ఒత్తిడిని పెంచుతుంది. కానీ, దీన్ని ప్రభాస్‌ ‘సాహో’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో అవలీలగా అధిగమించినట్లే కనిపిస్తున్నాడు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ‘బాహుబలి’పై కన్నా ‘సాహో’పై ఏర్పడిన అంచనాలే మరింత ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాపై జాతీయ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఓ యాక్షన్ థ్రిల్లర్‌ కథాంశంతో యువ దర్శకుడు సుజీత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లను తెప్పించి మరీ అదిరిపోయే పోరాట ఘట్టాలను చిత్రీకరించారు సుజీత్‌. ఈ యాక్షన్‌ ఎపిసోడ్ల వెనకున్న ఆసక్తికర అంశాలను తాజాగా ప్రభాస్‌ బయటపెట్టాడు. ఈ చిత్రంలోని ప్రధాన ఛేజింగ్‌ ఎపిసోడ్లను దాదాపుగా దుబాయ్‌లోనే చిత్రీకరించారు. ఇందు కోసం వందలాది కార్లు, ట్రక్కులను ఉపయోగించారు. ట్రైలర్‌లో కనిపించే ట్రక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలన్నీ ఎక్కడా గ్రాఫిక్స్‌ లేకుండా చాలా రియాలిస్టిక్‌గా తీశారట. తెరపై ఆ ట్రక్కులు ఎంత వేగంగా కదులుతుంటాయో వాస్తవంగా చిత్రీకరణ సమయంలోనూ అవి అంతే వేగంగా వెళ్తుంటాయట. ఆ పెద్ద ట్రక్కులను అంత వేగంగా నడమడమన్నది చాలా సవాల్‌తో కూడుకున్న పనట. ఎంతో నైపుణ్యమున్న డ్రైవర్లు మాత్రమే దాన్ని చేయగలుగుతారట. అందుకే ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా డ్రైవర్లను తెప్పించి చిత్రీకరణ జరిపించారట. ఈ ఎపిసోడ్‌ను చిత్రీకరించడానికి కూడా చాలా సమయం పట్టేదట. వందలాది స్టోరీ బోర్డులతో, ఎన్నో సార్లు ప్రాక్టీస్‌ చేసి మరీ సెట్స్‌పైకి తీసుకెళ్లేవారట. అందుకే కొన్ని ఎపిసోడ్లకు దాదాపు ఏడెనిమిది నెలల సమయం పట్టేదట. ఇక ఈ చిత్రీకరణ అంతా ఒక ఎత్తైతే వీటిని అంతే చక్కగా అవసరమైన మేరకు ఎడిట్ చేసుకోవడం కూడా ఓ సవాల్‌గా నిలిచిందట. కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్‌ను కట్‌ చేయడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందట. ఇందుకోసం దాదాపు 137 కట్లు చేసిందట. దీన్ని బట్టే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది ఊహించుకోవచ్చని ప్రభాస్‌ ‘సాహో’ విశేషాలు చెప్పుకొచ్చాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.