నా కెరీర్‌లో అత్యంత కష్టమైన సీన్‌ అది!!

సహజమైన అందానికి, అభినయానికి చిరునామా సాయిపల్లవి. తెరపై ఆమె కనిపించే విధానం చూస్తుంటే మన ఇంట్లో మనిషినో.. పక్కింటి పిల్లనో చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఆమె తొలి చిత్రం ‘ప్రేమమ్‌’ నుంచి ఆ మధ్య వచ్చిన ‘పడిపడి లేచే మనసు’ వరకు ప్రతి చిత్రంలోనూ ఈ తరహా సహజత్వం నిండిన పాత్రలతోనే అలరించింది. ఇక తెలుగులో ఆమె తొలి చిత్రం ‘ఫిదా’.. మరింత ప్రత్యేకం. అది తనకి తొలి చిత్రమే అయినప్పటికి తెలంగాణ గడుసు పిల్లలా ఆమె కనబర్చిన హావభావాలు.. తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు సినీప్రియుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇటీవల సాయిపల్లవి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అందులోని ఓ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. ఆ చిత్రంలో తాను ట్రాక్టర్‌ నడిపిన సన్నివేశం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఎపిసోడ్‌ అంది. ‘‘ట్రాక్టర్‌ను మామూలుగా నేర్చుకోని బయట నడపడం వేరు.. వ్యవసాయ క్షేత్రంలో బురద నేలలో నడపడం వేరు. నేను ‘ఫిదా’లో బురద నేలలోనే నడిపా. ఆ సమయంలో అలా ట్రాక్టర్‌ నడుపుతూ.. సహజ సిద్ధమైన హావభావాలతో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ ఎపిసోడ్‌ పూర్తి చేసే క్రమంలో చాలా సార్లు నియంత్రణ కోల్పోయా. నా కెరీర్‌లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అది’’ అని ఆ సినిమా చిత్రీకరణ రోజులను గుర్తుచేసుకుంది ఆమె. ప్రస్తుతం ఈ అమ్మడు రానా సరసన ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.