బన్నీతో పర్లే.. తారక్‌తో డ్యాన్స్‌ చిర్రెత్తుకొస్తుంది..

తెలుగు చిత్రసీమలో బెస్ట్‌ డాన్సర్స్‌ ఎవరు? అంటే.. ప్రతిఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు స్టార్‌ హీరోలు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లే. ఇద్దరి బెస్ట్‌ డ్యాన్సర్లతోటి ఆడిపాడిన అనుభవమున్న కథానాయిక సమంత. మరి ఆమె దృష్టిలో బన్నీ, తారక్‌లో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు అని అడిగితే ఓ ఆసక్తికరమైన జవాబిచ్చింది. తాజాగా ఆమె మంచు లక్ష్మీ చేస్తోన్న ఓ టాక్‌ షోలో పాల్గొనగా ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై సామ్‌ మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్‌తో డ్యాన్స్‌లో అంటే నడిచినంత సింపుల్‌గా చేసేయగలను కానీ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌ అంటేనే చిర్రెత్తుకొచ్చేస్తుంది. ఎంత కష్టమైన మూమెంట్‌నైనా సరే తారక్‌ చెమట పట్టకుండా, పెద్దగా ప్రాక్టీస్‌ కూడా చేయకుండా అవలీలగా చేసి పారేస్తుంటాడు. అదే అలాంటి స్టెప్పులు నేను చేయాల్సి వస్తే నా ముఖంలోని భావాల దగ్గర నుంచి ముఖంపైనున్న మేకప్‌ వరకు అన్నీ చెల్లాచెదురైపోతుంది. ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. ఆ డ్యాన్స్‌ పూర్తయ్యే సరికి నా లుక్కు పిచ్చిదానిలా మారిపోతుంది. ఇక యంగ్‌టైగర్‌లా చెమట పట్టకుండా అతి సులువుగా డ్యాన్స్‌లు వేసే మరో స్టార్‌ హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అది తమిళ స్టార్‌ విజయ్‌ మాత్రమే’’ అని చెప్పుకొచ్చింది సామ్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.