క్రిష్‌ చూపు సంపూపై పడిందట!!
‘కొబ్బరిమట్ట’.. సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురించి విడుదలకు ముందు చిత్రసీమలో పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కానీ, ఇది బాక్సాఫీస్‌ ముందుకొచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఓవైపు బరిలో ‘మన్మథుడు 2’ వంటి బడా సినిమా పోటీగా ఉన్నప్పటికీ ‘కొబ్బరిమట్ట’ ఎవ్వరూ ఊహించని వసూళ్లు కొల్లగొట్టింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ సినిమాతో సదరు చిత్ర నిర్మాతలు రూపాయికి రెండు రూపాయల లాభం సంపాదించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల చూపు సంపూపై పడింది. అతనితో చిన్న బడ్జెట్‌లో ఓ కామెడీ సినిమా తీయాలని ఎదురుచూస్తున్నారు. తాజాగా సంపూతో మూవీ చేయాలనుకునే వాళ్లలో అగ్ర దర్శకుడు క్రిష్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిర్మాణ సారథ్యంలో బర్నింగ్‌స్టార్‌తో ఓ వినోదాత్మక చిత్రాన్ని పట్టాలెక్కించాలని ఆలోచన చేస్తున్నారట. ఈయన మాత్రమే కాదు.. అగ్ర నిర్మాత సి.కల్యాణ్‌ కూడా సంపూతో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడట. ఏదేమైనా ‘కొబ్బరిమట్ట’ దెబ్బతో చిత్రసీమలో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు సంపూ.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.