సందీప్ రెడ్డి Vs స‌మంత‌... వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేనా?
తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ అది కాస్త సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో టాప్ ద‌ర్శ‌కుల లిస్టులో చేరిపోయాడు. అదే క‌థ‌ని బాలీవుడ్‌కి తీసుకెళ్లి.. రెండొంద‌ల కోట్ల సినిమాగా మ‌ర్చాడు. ఇంకే ముంది..? త‌న పేరు దేశ‌మంతా మార్మోగిపోయింది.త‌నే సందీప్ రెడ్డి వంగా. `అర్జున్ రెడ్డి`తో తెలుగులో సంచ‌ల‌నం సృష్టిస్తే, `క‌బీర్ సింగ్‌`తో బాలీవుడ్‌లోనూ పాగా వేశాడు. త‌న యాటిట్యూడ్ కూడా విచిత్రంగా ఉంటుంది. మ‌న‌సులో ఏమ‌నుకుంటే అది మాట్లాడేస్తుంటాడు. దాంతో.. వివాదాలూ ముసురుకోవ‌డం మొద‌లెట్టాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆడ‌వాళ్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అనే వ్యాఖ్య‌లు కొంత‌మంది మ‌నోభావాల్ని దెబ్బ‌తీశాయి. దీనిపై సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా... ఇలా చాలామంది సందీప్ రెడ్డిపై బ‌హిరంగంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతో సందీప్ రెడ్డి వంగా కాస్త త‌గ్గాడు. త‌న‌ని మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని, తాను స్త్రీ, పురుషులిద్ద‌రి త‌ర‌పున స‌మానంగానే మాట్లాడాన‌ని, కానీ.. అర్థం మాత్రం వేరేలా మారిపోయింద‌న్నాడు.


‘నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అని స‌ర్దుబాటు ధోర‌ణిలోకి వెళ్లాడు సందీప్‌. త‌న వ్యాఖ్య‌ల్ని స‌వ‌రించుకోవ‌డంతో ఈ వివాదం ప్ర‌స్తుతానికి స‌ర్దుమ‌ణిగిన‌ట్టే అనిపిస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.