శర్వా.. సిద్ధార్థ్‌ కథానాయకులుగా..

ఈ ఏడాది ఆరంభంలో ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు శర్వానంద్‌. ఇప్పుడు ‘శ్రీకారం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండేది. కానీ, కరోనా కొట్టిన దెబ్బకు ఇది కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడిది ఇంకా థియేటర్లలోకి రాకముందే శర్వా మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసేసుకున్నారు. అదే ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతితో చెయ్యనున్న ‘మహా సముద్రం’. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఓ వైవిధ్యభరిత మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో శర్వాతో పాటు మరో కథానాయకుడికీ స్థానమున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పాత్ర కోసం కథానాయకుడి అన్వేషణ కొనసాగుతున్నట్లు అజయ్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆ పాత్రకు లవర్‌ బాయ్‌ సిద్ధార్థ్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు చక్కటి ప్రేమకథా చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయిన ఈ యువ హీరో.. గతకొద్ది కాలంగా తెలుగులో నేరుగా ఏ చిత్రమూ చెయ్యలేదు. తమిళ్‌లో ఆయన చేసిన కొన్ని చిత్రాలు అనువాదాలుగా విడుదలయ్యాయి. కానీ, ఇప్పుడాయన తెలుగులో తన మార్కెట్‌ను మళ్లీ సంపాదించుకునే ఉద్దేశంలో ఉన్నారట. గతకొంత కాలంగా సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్న ఆయన.. ఇప్పుడీ ‘మహా సముద్రం’కు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.