మహేష్‌ కోసం ప్రత్యేకంగా ఓ రైలు!!


‘మహర్షి’ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మహేష్‌బాబు.. ఇప్పుడు నూతనోత్సాహంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ‘ఎఫ్‌ 2’ వంటి హిట్‌ తర్వాత అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. త్వరలో కశ్మీర్‌లో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌తో చిత్రీకరణ మొదలు కానుంది. అందుకే మహేష్‌ను అక్కడకు పంపేందుకు వీలుగా అనిల్‌ అన్నపూర్ణ స్టూడియో నుంచి కశ్మీర్‌కు ప్రత్యేకంగా ఓ రైలు వేయించబోతున్నారట. ‘ఏంటి.. అన్నపూర్ణ నుంచి ప్రత్యేకంగా రైలు పంపిస్తున్నారా?’ అని అలా నోరెళ్లబెట్టకొండి. అందరిలా ఆయన్ని అవుట్‌ డోర్‌లో ఏ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచో పంపిస్తే ఫ్యాన్స్‌తో ఇబ్బంది కదా.. అందుకే ఇలా ఇన్‌డోర్‌లో ప్రత్యేకంగా కశ్మీర్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో మహేష్‌.. ఆర్మీ మేజర్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో భాగంగానే ఆయన కశ్మీర్‌ నుంచి ఆంధ్రాకు రైలులో బయలు దేరుతాడట. ఈ సందర్భంగా రైలులో కీలకమైన కామెడీ సీన్లను కూడా ప్లాన్‌ చేశారట అనిల్‌ రావిపూడి. వీటికోసం రియల్‌ లొకేషన్లలో చిత్రీకరణ జరపాలంటే మహేష్‌ అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి.. అన్నపూర్ణలో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్‌ సెట్‌ను వేయిస్తోందట చిత్రబృందం. దీని కోసం భారీగానే ఖర్చు చేయబోతున్నారట. ఈ చిత్రంతోనే విజయశాంతి తిరిగి వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.