సెట్స్‌పైకి బ్యాడ్మింటన్‌ స్టార్‌గా..

వైవిధ్యభరిత చిత్రాలతో మెప్పిస్తున్న యువ హీరో సుధీర్‌బాబు.. ఇప్పుడు బ్యాడ్మింటన్‌ స్టార్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జీవితగాథతో ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు తెలియజేశారు. దీనికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుపై రెండేళ్ల క్రితం నుంచే వార్తలొస్తున్నప్పటికీ.. ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా ముస్తాబు చెయ్యాలని ప్లాన్‌ చెయ్యడం.. దానికి భారీ బడ్జెట్‌ కావల్సి రావడంతోనే ఇది ఆలస్యమవుతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలిగినట్లేనని సుధీర్‌ నుంచి క్లారిటీ వచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. ఈ బయోపిక్‌పై నోరు విప్పారు. ‘‘ఓ ప్రముఖ నిర్మాణ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో నిర్మించేందుకు ముందుకొచ్చింది. నిజానికి ఈ చిత్ర హిందీ వెర్షన్‌ కోసం మరో నటుడిని తీసుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. ఇప్పుడా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండు భాషల్లోనూ నేనే నటిస్తా. గోపీచంద్‌ పాత్ర కోసం నేను రెండేళ్లుగా బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటూనే ఉన్నా. త్వరలోనే ఇది పట్టాలెక్కుతుంది’’ అని ఆ ముఖాముఖీలో తెలియజేశారు సుధీర్‌. ప్రస్తుతం ఈ యువ హీరో నుంచి ‘వి’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. స్టార్‌ హీరో నాని ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఉగాది కానుకగా విడుదల కావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.