నా సినిమా కాకపోయినా సంతోషమే

‘‘నా సినిమా బాగా ఆడితే ఎంత ఆనందిస్తానో.. నేను నటించని సినిమా ఆడినా అంతే సంతోషిస్తాను. ఎందుకంటే చిత్రసీమ బాగుండాలి. అప్పుడే నేను బాగుంటా’’ అంటోంది తమన్నా. ప్రస్తుతం ‘సైరా’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుదేవాతో కలసి నటించిన ‘అభినేత్రి 2’ త్వరలో విడుదల అవుతోంది. తమన్నా మాట్లాడుతూ ‘‘చిత్రసీమకు విజయాలు చాలా అవసరం. వంద సినిమాలు విడుదల అయితే అందులో పది మాత్రమే విజయం సాధిస్తాయి. ఇప్పుడున్న పోటీలో ప్రేక్షకుల మెప్పు పొందడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి నేపథ్యంలో ప్రతి విజయమూ మధురమే. అందులో నేనున్నానా? లేదా? అనేది ఆలోచించను. ‘ఫలానా సినిమా హిట్టయ్యిందట’ అనే మాట ఎప్పుడు విన్నా మనసు ఆనందంతో నిండిపోతుంది.ఎందుకంటే ఇది నా పరిశ్రమ. ఇక్కడ ఒంటరిగా ఎవరూ ఎదగరు. తాము ఎదుగుతూ మరింత మందిని నడిపిస్తుంటారు. ఓ సినిమా ఆడిందంటే చాలామంది లాభపడతారు. ప్రతి నిర్మాత లాభపడాలి. అప్పుడే కదా మరో సినిమా తీస్తారు. ఇప్పుడు కాకపోయినా మరోసారైనా నాకు అవకాశం ఇస్తారు’’ అంటూ ఆశావాహ దృక్పథంతో చెప్పింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.