నా యాస అదిరిపోతుంది

‘ ‘ఇప్పటి వరకు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పా కానీ, తెలంగాణ యాసలో సంభాషణలు పలకడం ఓ కొత్త అనుభూతిని అందించింది’’ అంటోంది తమన్నా. ప్రతి సినిమా నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఇష్టపడతానంటోంది ఆమె. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌తో కలిసి ‘సిటీమార్‌’లో నటిస్తోంది. ఈ సినిమా అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది. ‘‘నేను చేస్తున్న తొలి క్రీడా నేపథ్య చిత్రమిది. కబడ్డీ కోచ్‌గా కనిపిస్తా. నటిగా నాకీ పాత్ర ఓ సరికొత్త సవాల్‌ లాంటిదే. అంతేకాదు ఈ చిత్రం కోసం నేను మరింత ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణం నా పాత్ర మాట్లాడబోయే యాస. తెలుగులో నేనిప్పటికి చాలా సార్లు స్వయంగా సంభాషణలు చెప్పుకున్నా.. కానీ, ప్రత్యేకంగా ఓ యాసలో ఎప్పుడూ డబ్బింగ్‌ చెప్పుకోలేదు. ఆలోటు నాకీ చిత్రంతో తీరింది. నేనీ చిత్రం కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికా. మొదట్లో నాకిది కాస్త క్లిష్టంగానే అనిపించినప్పటికీ అలవాటయ్యే కొద్దీ ఈ యాసలోని సొగసును, మాధుర్యాన్ని నేనెంతో ఆస్వాదించా. నిజంగా తెరపై నా యాస అదిరిపోయేలా వినిపిస్తుంది’’ అని చెప్పింది తమన్నా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.