అప్పుడు విలన్‌గా.. ఇప్పుడు హీరోగా..

గో
పీచంద్‌..  ఆరంభంలో ప్రతినాయక పాత్రలు పోషించి తన నటనా చాతుర్యాన్ని చాటుకున్నాడు. ‘జయం’, ‘నిజం’ చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురింపించారు. ఓ రకంగా ఈ చిత్రాల్లోని కథానాయకులకంటే గోపీచంద్‌కే ప్రేక్షకాధరణ లభించిందంటే ఆయన విలనిజం ఏ రేంజ్‌లో పండిందో అర్థంచేసుకోవచ్చు. ఈ రెండు పాత్రల్ని గోపీచంద్‌కు ఇచ్చింది ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు తేజ. గోపీచంద్‌లో దాగి ఉన్న ప్రతినాయకుడ్ని వెండితెరపై ఆవిష్కరించాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుందని చిత్ర సీమలో వినిపిస్తోంది. అయితే తేజ ఈసారి గోపీచంద్‌ను హీరోగా తెరకెక్కించబోతున్నాడట.  ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. కానీ, దానిపై స్పష్టత రాలేదు. తాజాగా తేజ.. అమితాబ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడంటూ ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అమితాబ్‌ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదని, ఒకవేళ ఆయన నో చెప్తే ఆ కథను గోపీచంద్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాల టాక్. దీంతో ఈ కాంబినేషన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. మరి అమితాబ్‌తో అనుకున్న కథనే గోపీతో తెరకెక్కిస్తాడా, లేదా గోపీ కోసం మరో కథ రాశాడో? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా తేజ- గోపీ కలయికలో సినిమా అనగానే సినీ ప్రియుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. 

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.