‘వి’... పవన్‌ మహేష్‌ల మల్టీస్టారర్‌!!

వెండితెరపై చూసి తరించాలని కోరుకునే అరుదైన కలయికల్లో పవన్‌ కల్యాణ్‌.. మహేష్‌బాబుల మల్టీస్టారర్‌ కూడా ఒకటి. వీళ్లిద్దరి కలయికలో ఓ కథను సిద్ధం చెయ్యాలని ఇప్పటి వరకు ఏ దర్శకుడైనా సాహసం చేశారో.. లేదో? తెలియదు కానీ తాజాగా ఓ దర్శకుడు ఆ ప్రయత్నం చేసినట్లు బయటకొచ్చింది. ఇంతకీ ఈ సాహసం చేసింది మరెవరో కాదు.. వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. త్వరలో ఆయన నుంచి రాబోతున్న ‘వి’ అనే మల్టీస్టారర్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా.. నేచురల్‌ స్టార్‌ నాని ప్రతినాయక పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. అయితే వాస్తవానికి ఈ కథను పవన్‌ - మహేష్‌లను దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేశారట ఇంద్రగంటి. తాజాగా ఈ విషయాన్ని ఈ చిత్ర కథానాయకుడు సుధీర్‌ బయటపెట్టారు. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమం ‘అలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వి’ కథను దర్శకుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశారని అలీ.. సుధీర్‌ను ప్రశ్నించగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆయన. ‘‘ఇంద్రగంటి తొలుత ‘వి’ కథను పవన్‌ కల్యాణ్, మహేష్‌బాబుల్ని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారట. ఈ పాత్రలకు వాళ్లయితేనే న్యాయం చేయగలరని అనుకున్నారు. కానీ, అది అనుకున్నంత ఈజీ కాదు. దీంతో ఈ చిత్రాన్ని మాతో పూర్తి చేశాడు’’ అని సుధీర్‌ షోలో వెల్లడించాడు. మరి ఈ కథ విషయాన్ని ఇంద్రగంటి పవన్‌ - మహేష్‌లకు చెప్పాడా? అసలీ చిత్ర విషయంలో ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఈ బుల్లితెర కార్యక్రమం పూర్తిగా ప్రసారమైతే గానీ చెప్పలేం. పవన్‌.. మహేష్‌లు ఇంత వరకు కలిసి నటించనప్పటికీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’లో ఇద్దరి భాగస్వామ్యం ఉంది. అందులో పవన్‌ కథానాయకుడిగా నటించగా.. ఆ చిత్రానికి మహేష్‌ తన గాత్రం అందించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.