వెంకీ చేతిలో మరో క్రేజీ రీమేక్‌!!

ఇటీవలే ‘ఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోని ఫుల్‌ జోష్‌లోకి వచ్చాడు సీనియర్‌ హీరో వెంకటేష్‌. ఈ జోరులోనే ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ను షురూ చేసేశాడు. ఇప్పుడీ మల్టీస్టారర్‌ షూటింగ్‌ కశ్మిర్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మరో క్రేజీ రీమేక్‌ను లైన్లో పెట్టేశాడట వెంకీ. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. ఇటీవలే బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించిన ‘దే దే ప్యార్‌ దే’. అజయ్‌ దేవగణ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. యాభై ఏళ్ల వయసులో.. పాతికేళ్ల కొడుకు వుండీ, భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి తన తనయుడి వయసున్న అమ్మాయితో ప్రేమలో పడటమే ఈ చిత్ర కథ. వినోదానికి ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమిది. ఇప్పుడీ కథను తెలుగులో పునర్నిర్మిస్తే.. వెంకీ ఏజ్‌కు, ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు ఆయనకు కుటుంబ ప్రేక్షకుల్లో, యువతరంలో మంచి క్రేజ్‌ ఉంది కాబట్టి పక్కాగా మంచి ఫలితమే వస్తుంది. అందుకే ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకునే వెంకీ, సురేష్‌బాబు ఈ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశముంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.