28ఏళ్ల తర్వాత మరోసారి భార్యాభర్తలుగా!!

దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి భార్యాభర్తలుగా సినీప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది విక్టరీ వెంకటేష్‌ - టబు జోడీ. వీరిద్దరూ తొలిసారిగా 1991లో వచ్చి ‘కూలీ నెంబర్‌.1’లో జంటగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతోనే టబు తొలిసారిగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో జోరు చూపిన ఈ భామ.. ఉత్తరాది నుంచి అవకాశాలు రావడంతో అటు వైపు వెళ్లిపోయింది. మధ్య మధ్యలో కొన్ని తెలుగు చిత్రాల్లో ఆమె తళుక్కున మెరిసినా అవన్నీ అతిథి పాత్రలే. కానీ, ఇన్నేళ్ల తర్వాత ఈమె తొలిసారి ఓ పూర్తిస్థాయి పాత్రతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం వెంకటేష్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘దే దే ప్యార్‌ దే’ను తెలుగులోకి రీమేక్‌ చేసేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వయసు మళ్లిన హీరో ఓ పాతికేళ్ల యువతితో ప్రేమలో పడటం అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించగా.. ఆయనకు జోడీగా టబునే నటించింది. ఇప్పుడిదే పాత్రను తెలుగులోనూ ఆమెతోనే చేయించేందుకు సిద్ధమైంది సురేష్‌ ప్రొడక్షన్‌. టబు కూడా తెలుగులో తన పాత్రలో మరోసారి కనిపించేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రంలోని రకుల్‌ పోషించిన పాత్రను ఆమెతోనే చేయిస్తారా? లేక మరో కథానాయికను ఎంచుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.