రెండు నిమిషాల సేపు లిప్‌లాక్‌ చేశాడట!!

తెలుగు చిత్రసీమలో అదరగొట్టే అధర చుంబనాలకు చిరునామాలు విజయ్‌ దేవరకొండ చిత్రాలు. ‘అర్జున్‌ రెడ్డి’తో తెలుగు తెరపై ఓ ముద్దల ఉత్సవాన్ని చూపించిన ఈ రౌడీ హీరో.. ‘గీత గోవిందం’తోనూ తన ముద్దు ముచ్చట్లను కొనసాగించాడు. ఇక ‘నోటా’, ‘టాక్సీవాలా’ల్లోనూ విజయ్‌ ముద్దుల సందడి ప్రేక్షకులకు కనులవిందును అందించింది. ఇప్పుడు దేవరకొండ తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా ఇందుకు మినహాయింపు కాదని టీజర్‌తోనే తెలిసిపోయింది. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 26న విడుదల కాబోతుంది. ఇక విజయ్‌ నటిస్తున్న మరో చిత్రాన్ని దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోనూ మైమరపించే ముద్దు సన్నివేశాలకు లోటుండదట. అంతేకాదు.. ఈసారి తన లిప్‌లాక్‌ల డోస్‌ను మరింత ఎత్తుకు పెంచబోతున్నాడట. ముఖ్యంగా ఈ మూవీలో రెండు నిమిషాల పాటు సాగే ఓ ముద్దు సన్నివేశాన్ని ఎంతో కళాత్మకంగా తెరకెక్కించారట. ఈ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని సమాచారం. మరి విజయ్‌తో పెదవులు కలిపిన ఆ ముద్దుగుమ్మ ఎవరన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఎందుకంటే ఇందులో ముగ్గురు నాయికలకు ఛాన్స్‌ ఉంది. ఓ పాత్రకు రాశీ ఖన్నాను తీసుకోగా.. మరో ఇద్దరు నాయికలుగా ఐశ్వర్య రాజేశ్, ఇసాబెల్లాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.