దేవ‌ర‌కొండ‌తో రాశిఖ‌న్నా?
ఆచితూచి అడుగులేస్తున్న కథానాయిక‌ల్లో రాశిఖ‌న్నా ఒక‌రు. `తొలి ప్రేమ‌`తో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకొన్న ఆమెకి అవ‌కాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె మాత్రం ఏరికోరి `శ్రీనివాస‌క‌ళ్యాణం`ని ఎంపిక చేసుకొంది. ఆ చిత్రంతో న‌టిగా మ‌రోసారి మంచి మార్కులు ద‌క్కించుకొన్న రాశిఖ‌న్నా, త‌దుప‌రి యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌లిసి న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. కె.ఎస్‌.రామారావు నిర్మించ‌నున్న ఆ చిత్రంలో మొద‌ట కాజ‌ల్ న‌టిస్తుంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ తాజాగా ఆ అవ‌కాశం రాశి చేతికి అందిన‌ట్టు తెలుస్తోంది. క్రాంతి మాధ‌వ్ చిత్రాల్లో కథానాయిక‌ల‌కి బ‌ల‌మైన పాత్ర‌లు ల‌భిస్తుంటాయి. ఆయ‌న ఇదివ‌ర‌కు తీసిన `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు`తో నిత్య మేన‌న్‌కి మంచి పేరొచ్చింది. ఇటీవ‌లే క్రాంతిమాధ‌వ్ చెప్పిన క‌థ విన్న రాశి వెంట‌నే సినిమా చేయ‌డానికి అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమె త‌మిళంలో మూడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే క్రాంతిమాధ‌వ్ చిత్రం కోసం రంగంలోకి దిగ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.