కియారా.. జాన్వీలపై రౌడీ చూపు

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ దక్షిణాదికి మాత్రమే పరిమితం కాదు. ఇంత వరకు బాలీవుడ్‌లో ఒక్క చిత్రం చేయకున్నా.. ఆయనకు ఉత్తరాదిలోనూ అక్కడి స్టార్‌ హీరోల స్థాయిలో క్రేజ్‌ ఏర్పడిపోయింది. బాలీవుడ్‌ స్టార్‌ నాయికలైన ఆలియా భట్‌.. జాన్వీ కపూర్‌.. వంటి వారు సైతం దేవరకొండతో నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ల సంగతి సరే.. ఇంతకీ విజయ్‌కు బాలీవుడ్‌లో ఎవరితో ఆడిపాడాలనుందో తెలుసా? తాజాగా ఈ విషయాన్నే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రౌడీ. ‘ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న యువ కథానాయికల్లో ఎవరితో మీ తర్వాతి చిత్రం చెయ్యాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘‘జాన్వీ కపూర్, కియారా అడ్వాణీలతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు దేవరకొండ. అయితే ప్రత్యేకంగా కొందరితోనే చెయ్యాలని లక్ష్యాలేమీ పెట్టుకోలేదని, మంచి నటి అనిపించుకున్న ప్రతి ఒక్కరితోనూ కలిసి నటించాలి అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఏ చిత్రసీమలోని కథానాయికలతోనైనా సరే జోడీ కట్టేందుకు తాను సిద్ధమని తెలియజేశారు ఈ రౌడీ హీరో. ప్రస్తుతం ఈ యువ హీరో బాలీవుడ్‌ భామ అనన్య పాండేతో కలిసి ‘ఫైటర్‌’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా ముస్తాబవుతోన్న ఈ చిత్రాన్ని.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.