మరో ‘వి’ వస్తుందట!!

యువ కథానాయకుడు నాని ఈ వేసవికి ‘వి’ చిత్రంతో ప్రతినాయకుడిగా పలకరించబోతున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సుధీర్‌బాబు కథానాయకుడి శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా దర్శనమివ్వబోతున్నారు. నివేదా థామస్, అదితీరావు హైదరీ కథానాయికలు. ఉగాది కానుకగా ఈ ఏప్రిల్‌ 25నే విడుదల కావల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. వైవిధ్యమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఇది దొంగ - పోలీస్‌ల మధ్య నడిచే ఆసక్తికర కథాంశంతో నడవబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘వి 2’ కూడా రానున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా ముగింపులో ఈ విషయాన్ని బయటపెట్టనుందట చిత్ర బృందం. దీనికి తగ్గట్లుగానే ఇంద్రగంటి అనేక ట్విస్ట్‌లతో ముగింపును రాసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ కొనసాగింపు చిత్రం వెంటనే పట్టాలెక్కుతుందా? లేదా? అనేది చిత్ర ఫలితాన్ని బట్టీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే ‘వి’ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ప్రస్తుతానికి నాని చేతిలో ‘టక్‌ జగదీష్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాలున్నాయి. ఇవన్నీ పూర్తి కావడానికి ఈ ఏడాది ఆఖరు దాకా వేచి చూడక తప్పదు. కాబట్టి ఒకవేళ ‘వి’ సీక్వెల్‌ ఖరారైనా.. సెట్స్‌పైకి వెళ్లడానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.